నల్గొండలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి 

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. నల్గొండలో  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎఫ్‌సీఐ డివిజనల్ ఆఫీస్, బఫర్ స్టోరేజ్ కాంప్లెక్సును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ..  నల్గొండలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాములు నిర్మాణం అవసరమన్నారు. 

తిప్పర్తి మండలంలో తగిన స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. నల్గొండలో బాయిల్డ్ రైస్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో, మిల్లర్లు రా రైస్ లేదా పార్‌బాయిల్డ్ రైస్ ఏదైనా ఎఫ్‌సిఐకి సరఫరా చేసే అవకాశం కల్పించాలని కోరారు. నల్గొండ జిల్లా బత్తాయి ఉత్పత్తి లో జాతీయ స్థాయిలో ప్రత్యేకత కలిగి ఉందన్నారు.  ప్రతి సంవత్సరం సుమారు 4.50 లక్షల టన్నుల తీపి బత్తాయి పండుతుందన్నారు.  ఈ పంటను ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి జాబితాలో చేర్చాలని కోరారు.

దీనివల్ల అధికారిక బ్రాండింగ్, మార్కెటింగ్, మార్కెట్ అనుసంధానం, మంచి ధరలు లభిస్తాయని తెలిపారు. బత్తాయి నిల్వ సమస్యలను ఎదుర్కొంటున్న రైతుల కోసం 2,500 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్‌ను నల్గొండలో ఏర్పాటు చేయాలని కోరారు.