ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చూడాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చూడాలి :  మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  •     కలెక్టరేట్‌‌‌‌లో ఆఫీసర్లు, రైస్‌‌‌‌మిల్లర్లతో  మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష  

నల్గొండ అర్బన్, వెలుగు:  అధికారులు, రైస్‌‌‌‌ మిల్లర్లు సమష్టిగా పనిచేసి ధాన్యం కొనుగోలు సవ్యంగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.  బుధవారం నల్గొండలోని కలెక్టరేట్‌‌‌‌లోని సమావేశమందిరంలో ధాన్యం, పత్తి సేకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆఫీసర్లు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..  రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా  ధాన్యం సేకరణలో రెండో స్థానం ఉందని, వచ్చే నెల రోజులపాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు.  

కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో  నైట్ షిఫ్టులు ఏర్పాటు చేసి హమాలీలు పని చేసే విధంగా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..  ఈ సీజన్‌‌‌‌లో జిల్లాలో 6,50,000  మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని, నల్గొండ నియోజకవర్గంలో ఎక్కువగా దొడ్డు ధాన్యం వస్తున్నదని, ఇప్పటివరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. 

మిల్లింగ్‌‌‌‌ చార్జీలు, ట్రాన్స్‌‌‌‌పోర్టు బకాయిలు ఇప్పించండి: రైస్ మిల్లర్లు  

 రైస్ మిల్లర్లు నారాయణ, భద్రం, ఇంద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ.. బాయిల్డ్ రైస్ కోటా జిల్లాకు ఎక్కువగా ఇప్పించాలని, బకాయిలు ఉన్న మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్‌‌‌‌పోర్టు బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ..  జిల్లాకు బాయిల్డ్ రైస్ కోటా ఎక్కువగా ఇచ్చే విషయం సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.  పత్తి కొనుగోలు విషయమై ఢిల్లీలోని ఆఫీసర్లతో ఇది వరకే మాట్లాడినట్లు తెలిపారు. బకాయిల విషయంలో ఎఫ్‌‌‌‌సీఐ ఆఫీసర్లతో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. 

ఇటీవల మృతి చెందిన మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమాల్లో  రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,  డీఎస్ ఓ వెంకటేశ్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యా నాయక్, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తదితరులు  పాల్గొన్నారు.