నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి 

నల్గొండ, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 100శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని శ్రేణులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  పిలుపునిచ్చారు. నల్గొండ గడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని, కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలమని మంత్రి పేర్కొన్నారు.  నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం విస్తృత సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనలతో  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో  ప్రతి వర్గానికీ అండగా నిలుస్తుందని గుర్తు చేశారు. అభివృద్ధిలో నల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానన్నారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలదే అని దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గంలో గ్రామీణ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారుస్తానని..విద్యా,వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. 

పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.  9 నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో  లా ఫార్మసీ కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎస్ఎల్బీసీ  సొరంగం నూతన టెక్నాలజీతో 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.