పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ

పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ
  • అటవీశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి సురేఖ
  •     మంత్రి సీతక్కతో కలిసి పోడు సమస్యలపై రివ్యూ
  •     కొత్తగా పోడు కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజనులకు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు :  అటవీ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పోడు రైతుల హక్కులను కాపాడడానికి, అటవీ అధికారులకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందన్నారు. పాత పోడు రైతులను ఇబ్బంది పెట్టేది లేదని, కొత్తగా పోడు చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్‌‌లో అటవీశాఖ అధికారులు మంత్రి సీతక్కతో కలిసి పోడు భూముల సమస్యలపై మంత్రి సురేఖ రివ్యూ చేశారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులకు, అటవీశాఖకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పోడు భూములు కేటాయించినట్టు తమ దృష్టికి వచ్చిందని, అప్పటి పోడు భూముల పంపిణీకి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. 

ఇతర రాష్ట్రాల వాళ్లను రానియ్యొద్దు

చత్తీస్​గఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. పక్క రాష్ట్రాల గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని, భవిష్యత్ లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ప్రారంభమైనందున మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టాలని  సూచించారు. వేప, బొడ్డు మల్లె, గంగరేగు, కుంకుడు, చీమ చింతకాయ, సీతాఫలం, రావి వంటి చెట్లు ఎక్కువగా నాటాలన్నారు. అటవీశాఖ నర్సరీల్లో చాలా మొక్కలు అందుబాటులో ఉన్నందున ఆ మొక్కలను ఉపయోగించుకోవాలన్నారు. బయట నుంచి మొక్కలు కొనకుండా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కానున్న శాఖలకు సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, డిప్యూటీ సెక్రటరీ శ్రీలక్ష్మి, పీసీసీఎఫ్ డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు సంయమనం పాటించాలి: సీతక్క

అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో.. కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తి, కచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అటవీశాఖ అధికారులు సంయమనంతో వ్యవహరించాలన్నారు. అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా ఆ భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.