
- భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తం: మంత్రి సురేఖ
- అధికారులు సమన్వయంతో పనిచేయాలి: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జులై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జులై 29న అంబారీ ఊరేగింపు ఉత్సవంతో ముగుస్తుందని ప్రకటించారు. జులై 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 22న ఉదయం 9.30కు రంగం కార్యక్రమాలు ఉంటాయన్నారు. 29న అక్కన్న మాదన్న ఆలయం వద్ద అంబారీపై ఊరేగింపు ఉత్సవం, ఆ తర్వాత ఘటాల ఊరేగింపు, నిమజ్జనంతో బోనాల జాతర ముగుస్తుందని మంత్రి వివరించారు. ఆషాడ బోనాలకు ఏర్పాట్లపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావుతో కలిసి శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్ డీలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు రివ్యూ మీటింగ్స్ నిర్వహించాలని ఆదేశించారు. బోనాల పండుగ ముగిసేవరకు అధికారులందరూ కోఆర్డినేషన్ తో పని చేయాలని చెప్పారు. బోనాల తేదీలు, పూర్తి వివరాలతో త్వరలోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, పోలీస్, ట్రాన్స్ కో, ఆర్టీసీ, రైల్వే, ఐ అండ్ పీఆర్, హెచ్ఎండబ్ల్యూఎస్ & ఎస్ బీ, సివిల్ సప్లైస్, పురావస్తు, వైద్యారోగ్య శాఖ, సాంస్కృతిక శాఖ, మెట్రో రైల్, క్యూరేటర్(అటవీశాఖ), అగ్నిమాపక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
28 ఆలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ
బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున 28 దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వీటిలో గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, మీర్ ఆలం మండిలోని మహాకాళి సహిత మహాకాళేశ్వర ఆలయాలు, శాలిబండలోని అక్కన్న మాదన్న, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి, కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ, సబ్జీ మండిలోని నల్లపోచమ్మ, చిలకలగూడలోని కట్ట మైసమ్మ (మొత్తం 9) ఆలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. మిగతా19 ఆలయాల్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు.
వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు
బోనాల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను కేటాయించేలా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి సురేఖ కోరారు. మెట్రో రైల్ సర్వీసులను కూడా పెంచాలని అధికారులను కోరారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు కాబట్టి షీ టీమ్స్ అలర్ట్ గా ఉండాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో విపత్తు నిర్వహణ విభాగం వేగంగా స్పందించాలని ఆదేశించారు.
అగ్నిమాపక శాఖ తమ సిబ్బందితోపాటు వాలంటీర్లను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. భక్తులకు తాగునీరు, టాయిలెట్స్ వంటివి ఏర్పాటు చేయాలని, వేడుకల నిర్వహణకు ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల సహాయం తీసుకోవాలని చెప్పారు. ఏనుగు అంబారీపై ఊరేగింపు కోసం కర్నాటక నుంచి ఏనుగును తీసుకొస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దేవాలయాల కమిటీలతో త్వరలోనే మీటింగ్ నిర్వహించి జాతర ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సమీక్షిస్తామన్నారు.
గతంలో అరకొర నిధులతో నిర్వహణ
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను గత ప్రభుత్వ హయాంలో అరకొర నిధులతో నిర్వహించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహిస్తామని, ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రూ. 25 కోట్లు రిలీజ్ చేసేలా చూస్తామన్నారు. అవసరమైతే అదనపు ఫండ్స్ అడుగుతామన్నారు. రెండు మూడు రోజుల్లో ఈ నిధులు విడుదలైన వెంటనే దేవాలయాల అలంకరణ, సౌకర్యాల కల్పన పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు రానివ్వొద్దు: పొన్నం
ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజల భాగస్వామ్యంతో అందరూ స్వేచ్ఛగా ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగకు అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. దేవాలయాల వద్ద తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని ఆలయాలను కలర్ లైట్లతో అందంగా ముస్తాబు చేయాలని పొన్నం చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రంగారెడ్డి ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దేవాలయాల ప్రతినిధులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బక్రీద్ పండుగకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇదివరకే ఆదేశించామని, పోలీసులు, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.