బీజేపీవాళ్లే మాపై దాడి చేసిన్రు

బీజేపీవాళ్లే మాపై దాడి చేసిన్రు

మునుగోడు, నారాయణపురం రోడ్​షోలో కేటీఆర్

యాదాద్రి/మునుగోడు, వెలుగు :
మునుగోడు బైపోల్ లో ఓటమి భయంతోనే బీజేపీ వాళ్లు పలివెల గ్రామంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్​పై దాడి చేశారని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టామని, వాళ్ల సంగతి పోలీసులే చూసుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మునుగోడు, సంస్థాన్ నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. మన ప్రభుత్వం ఇంకా 14 నెలలు అధికారంలో ఉంటుందని, ఈ టైమ్ లో మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

‘ఈ గట్టున రేట్లు పెంచిన నరేంద్రమోదీ, బేకార్​గాళ్లైన బీజేపీ, కాంగ్రెస్ ఉంది. ఆ గట్టున పింఛన్లు పెంచిన కేసీఆర్, కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి ఉన్నరు. ఏ గట్టున ఉంటారో..? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలి’ అని అన్నారు. ‘మందు, మ‌ట‌న్ పెట్టగానే ఆగం కావద్దు.. డబ్బుకో, మందుకో లొంగిపోయి బీజేపీకి ఓటేస్తే మ‌న కంట్లో మ‌న‌ం పొడుచుకున్నట్టే.. ఎవ‌రి వ‌ల్ల మ‌న బ‌తుకులు బాగుప‌డుతాయో ఆలోచించండి.. మ‌న‌ది పేద‌ల ప్రభుత్వం బీజేపీది పెద్దల ప్రభుత్వం.. రైతుబంధు కావాలా.? రాబందు కావాలా? ఆలోచించుకోండి’ అని సూచించారు. ఇక్కడ పోరాటం జ‌రుగుతున్నది రెండుపార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, రెండు భావ‌జాలాల మ‌ధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు.

‘18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజ‌గోపాల్ రెడ్డి. ఇంటింటికీ తులం బంగారం ఇచ్చినా ఇస్తడు.. అవ‌న్నీ గుజరాత్ నుంచి వచ్చిన దొంగ‌ల పైస‌లు.. తులం బంగారం గల్లా పట్టి అడగి తీసుకోండి.. ఓటు మాత్రం కారుకు వేయండి’ అని కోరారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్​ను పూర్తి చేసి మునుగోడును స‌స్యశ్యామ‌లం చేస్తామని, రాచ‌కొండ‌కు కూడా లిఫ్ట్‌లు పెట్టిస్తామని చెప్పారు. రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టాడన్నారు. మోదీ అధికారంలోకి వ‌చ్చాక ఒక్క మంచి ప‌ని చేయ‌లేదని, రూ.400 ఉన్న సిలిండ‌ర్ ధ‌రను రూ.1200ల‌కు పెంచాడని, ఉప్పు, ప‌ప్పు, చింత‌పండుతో సహా అన్ని నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగాయన్నారు. పెట్రోల్ ధ‌ర రూ.70 ఉంటే.. ఇప్పుడు రూ.110. ఉందని, పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగితే ఆర్టీసీ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. సామాన్యుడి బ‌తుకును నాశ‌నం చేసిన మోడీ.. కార్పొరేట్లను క‌డుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడని విమర్శించారు.