ఆర్థిక పరిస్థితి మంచిగైతే జీతాలు పెంచుతాం

ఆర్థిక పరిస్థితి మంచిగైతే జీతాలు పెంచుతాం

రాజన్న సిరిసిల్ల, వెలుగు:రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆశా వర్కర్లు అడిగినంత జీతాలు ఇవ్వలేకపోయామని, పెంచాలని ఉన్నా కరోనా సంక్షోభం వల్ల పెంచలేకపోయామని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు అందించిన సేవలు మరువలేనివన్నారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖాన, జిల్లెల్ల ప్రభుత్వ స్కూల్​లోని డిజిటల్‌ క్లాస్‌రూమ్‌,సోలార్‌ప్లాంట్‌, సిరిసిల్ల పట్టణంలో ముస్లిం షాదీఖానా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ కంటే ఎక్కువగా వేతనాలు ఇక్కడ ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

తెలంగాణ పథకాలు దేశానికే తలమానికం

తెలంగాణలో కులమతాలతో సంబంధం లేకుండా గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రజలను ప్రజలుగానే చూశారు తప్ప.. మతం పేరు మీద కులం పేరు మీద ఎప్పుడు రాజకీయాలు చేయలేదని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాల్లో 7 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్  పేర్కొన్నారు. సిరిసిల్లలో ఇటీవల ఎన్నికైన ప్రెస్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. కొత్త పాలకవర్గంతో ప్రమాణం చేయించారు.