కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది : కేటీఆర్

కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రవేటు పరం చేసే కుట్రలను తిప్పి కొడుతామన్నారు. పొలిటికల్ టూరిస్టుల మాటలను నమ్మి.. ప్రజలు మోసపోవద్దని చెప్పారు. గులాబీ జెండా నీడలో తెలంగాణ భద్రంగా ఉందని వ్యాఖ్యానించారు. గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నవ నిర్మాణ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఇదే కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

రామగుండంలో రూ.300 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్టంలో ఎక్కడా లేని విధంగా నూతన హంగులతో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించామని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. రామగుండం ప్రాంతం సీఎం కేసీఆర్ కు చాలా ఇష్టమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.