పదిసార్లు అధికారమిస్తే..ఏమీ చేయని దద్దమ్మలు

పదిసార్లు అధికారమిస్తే..ఏమీ చేయని దద్దమ్మలు
  • ప్రజలను 50 ఏండ్లు అరిగోస పెట్టిన నీచులు
  • తుంగతుర్తి సభలో కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
  • ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదని, కరెంట్ ఇవ్వలేదని విమర్శ

సూర్యాపేట, వెలుగు: పది సార్లు అధికారం ఇస్తే ఏమీ చేయని, చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 50 ఏండ్లలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదని, ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదని విమర్శించారు. గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీలో 80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. తర్వాత నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గం ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ ప్రజలను తమ బిడ్డల్లా చూసుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షాలకు అసూయ పుడుతున్నది. నిబద్ధత, విజన్ ఉన్న కేసీఆర్ వెంటే యావత్ ప్రజలు ఉన్నారు” అని చెప్పారు. జిల్లాలో ఫ్లోరైడ్‌‌‌‌తో ప్రజలు జీవచ్ఛవాలుగా మారిపోతే దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారని మండిపడ్డారు.

అలాంటి వాళ్లను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు పచ్చి మోసగాళ్లు. తెలంగాణ ప్రజలను 50 ఏండ్లు అరిగోస పెట్టిన నీచులు. 50 ఏండ్లపాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దు” అని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదని, యాక్టింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కోరినట్లుగా తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలకు మొత్తం రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గాదరి కిషోర్ కే ఓటేయాలని కోరారు. 

అభివృద్ధిని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తరా?: జగదీశ్ రెడ్డి

‘‘తెలంగాణలో అభివృద్ధి జరగలేదని నిరూపించగలిగితే క్షమాపణలు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో జరిగిన ప్రగతిని నిరూపిస్తే కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి నుంచి ఢిల్లీ వరకు ముక్కు నేలకు రాస్తారా?” అని మంత్రి జగదీశ్‌‌‌‌ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ పాపాన్ని కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో మటుమాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌దని పేర్కొన్నారు. కాకతీయుల పాలనకు పూర్వమే రాష్ట్రం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేదని, అలాంటి ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం కాంగ్రెస్ పాలకులదేనని దుయ్యబట్టారు.