
- ఓఆర్ఆర్ టెండర్లలో నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
- భట్టి విక్రమార్క, రఘునందన్‌కు కేటీఆర్ సవాల్
- తెలంగాణలో సంక్షేమం సముద్రమంత, అభివృద్ధి ఆకాశమంత
- రాష్ట్రంలో డెవలప్మెంట్ను మెచ్చుకున్న జగన్, చంద్రబాబుకు థ్యాంక్స్
- కర్నాటకలో గెల్వంగనే కాంగ్రెసోళ్లు కలలు కంటున్నరు
- మోదీకే భయపడలేదు.. పత్రికలు రాస్తే భయపడ్తమా?
- ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నం
- రేవంత్‌పై పరువు నష్టం దావా వేసినం.. ఆయన అంతుచూస్తం
- మళ్లీ అధికారంలోకి వస్తామని, కేసీఆరే సీఎం అవుతారని ధీమా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్‌మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలోనూ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి. నేను చెప్పింది తప్పయితే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఓడించాలి” అని ఆయన అన్నారు. తెలంగాణలో సంక్షేమం సముద్రమంత, అభివృద్ధి ఆకాశమంత అని పేర్కొన్నారు. శనివారం పల్లె ప్రగతి–పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీఐ కొందరికి రైట్ టు ఇన్కమ్గా మారిందని ఆరోపించారు.
ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో తప్పు చేయలేదని.. దేశమంతా టీవోటీ (టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానమే నడుస్తున్నదని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసినం. ఆయన అంతుచూస్తం” అని హెచ్చరించారు. తెలంగాణలోని ఏ పల్లెలో, పట్టణంలో చూసినా సంక్షేమం, సంతోషమున్నది తప్ప సంక్షోభం లేదన్నారు. కాంగ్రెస్‌లో మాత్రమే సంక్షోభం ఉందని విమర్శించారు.
వచ్చే సారి కూడా 100 శాతం తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది. బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్నది.. ప్రపంచంలో ఎకరానికి రూ. 10 వేల పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం.. రైతులకు జీవిత బీమా ఇస్తున్నది.. లక్షా నూట పదహార్ల కానుక ఇచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన రాష్ట్రం... ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ..అది మా పనితనం. మీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పం. భట్టి విక్రమార్క, రఘునందన్ రావుకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే బెటర్‌గా ఉందని రుజువు చేస్తే ఆదివారం పొద్దున ఫస్ట్ అవర్‌లో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా” అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నేతలు.. పాక్ క్రికెట్ టీమ్
కర్నాటకలో గెలిచారని, తెలంగాణలో కలలు కంటున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నాయకులే లేరు.. పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుని ప్రెసిడెంట్‌ను చేసుకున్నరు. మేం మోదీకే భయపడలేదు.. ఇక్కడ ఒకటి.. రెండు పేపర్లు పిచ్చి రాతలు రాస్తే భయపడ్తమా?’’ అని కామెంట్ చేశారు. ‘‘పాపం ఇక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు (కాంగ్రెస్) కూడా కలిసి కూర్చోలేరు.. ఇక్కడున్న వాళ్లకు అక్కడ గాంధీ భవన్లో గోతులు తవ్వుతున్నరు.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతల్ని చూస్తే తనకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గుర్తొస్తున్నదని కేటీఆర్ అన్నారు. ‘‘క్రికెట్ టీమ్‌లో 11 మంది ఆడుతరు. అయితే వెనుకటికి పాకిస్తాన్ టీమ్ ఉండేది.
అందులో కెప్టెన్ ఒకరు ఉంటరు, మిగతా వాళ్లంతా మాజీ కెప్టెన్లు..”అని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఉండేది నలుగురు ఎమ్మెల్యేలు.. వీళ్లు నలుగురు కలిసి ఒకేచోట కూర్చొని పనిచేయలేరు. కానీ వీళ్లు నాలుగు కోట్ల మందిని పాలిస్తమని గొప్పలు చెప్తరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది నలుగురే కానీ పాక్ క్రికెట్ టీమ్ తరహాలోనే కాంగ్రెస్ నేతలు మొత్తం 10 మంది సీఎం అభ్యర్థులం అంటూ ఒకరిపై ఒకరు నెగ్గే ప్రయత్నం చేస్తుంటరు. సీతక్కను రేవంత్‌రెడ్డి సీఎం అంటే..ఆ మాటలు జోక్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటరు” అని కామెంట్ చేశారు. నీళ్లకోసం ఆనాడు జానారెడ్డి దగ్గరికి వెళ్తే కన్నీళ్లు పెట్టించారని కేటీఆర్ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు కాంగ్రెసోళ్లకు 10 సార్లు చాన్స్ ఇచ్చినా వాళ్ల విశ్వసనీయత కాపాడుకోలేకపోయిన్రు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ను దీవిస్తున్నరు” అని చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు
‘‘గుజరాత్ మోడల్ అంతా ఒట్టి డొల్ల అని.. తెలంగాణలో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నారని పార్లమెంట్‌లోనే కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నం.. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారని ఆయన చెప్పారు. ‘‘నల్గొండను మానవరహిత జిల్లాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే. మేము నల్గొండలో ఫ్లోరెడ్ రక్కసిని రూపుమాపినం. కాంగ్రెస్ డబ్బా ఇండ్లు కట్టించి ఇచ్చింది.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినం.. ఒక్క డబుల్ బెడ్రూం ఇండ్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానం” అని కేటీఆర్ అన్నారు. గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌లో 35 ఫ్లైఓవర్లు నిర్మించిందని, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయిందని విమర్శించారు. ‘‘పంటలకు నీళ్లు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా, మత మంటలు లేపే పార్టీ కావాలో ఆలోచించాలి” అని అన్నారు.
భట్టి ఉంటున్న ఇంట్లో మీటర్ చెడిపోయింది
సీఎల్పీనేత భట్టి విక్రమార్క నీళ్ల కోసం రోజుకు ఒక ట్యాంకర్ తెచ్చుకుంటున్నామని చెప్తున్నది అవాస్తవమని కేటీఆర్ అన్నారు. ‘‘భట్టి అన్నకు సంబంధించి లెక్కలు తెప్పించిన. డ్యాక్యుమెంటరీ ఆధారాలు కూడా తీసుకొచ్చిన. ఆయన బంజారాహిల్స్‌లో ఉంటున్నరు. క్యాన్ నంబర్ 061336924. భట్టి విక్రమార్క ఉంటున్న ఇల్లు రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి పేరుపై ఉంది. రోజుకు ఒక ట్యాంకర్ ఆర్డర్ చేస్తున్నట్లు మీరు చెప్పిన్రు. కానీ మీరు ఉన్న ఇంట్లో మీటర్ చెడిపోయింది. మీటర్ ఎప్పుడు చెడిపోయిందో కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ వద్ద గణాంకాలు ఉంటయ్. జనవరి 2022 నుంచి మీ ఇంట్లో మీటర్ పనిచేయడం లేదు. ఆ మీటరు బాగు చేసుకొని ఉంటే మీకు కూడా అందరిలాగే ఉచితంగా 20 వేల లీటర్ల నీళ్లు వచ్చేవి. జనవరి 2022 నుంచి ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదు. మీకు తెలియదు. బుకాయించారు. అదరగొట్టేందుకు ఏదో మాట్లాడారు. సత్యదూరం మాటలు చెప్పడం సరైన పద్ధతి కాదు’’ అని ఆయన మండిపడ్డారు.
మళ్లీ రాబందులు తిరుగుతున్నయ్
తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కొన్ని రాబందులు మళ్లీ తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ‘‘ఇలాంటి సమయంలో మన కవి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఒక మాటను గుర్తు చేయాలనుకుంటున్న. ‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం కింద ఎర్త్..’ అని అలిశెట్టి చెప్పారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళం అయిపోతారని అన్నారు. ‘‘తెలంగాణతో బీఆర్ఎస్‌ది పేగుబంధం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎవరూ తెంచలేరు. తుంచలేరు. జనం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడినొళ్లే అక్కడకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారని కేటీఆర్ అన్నారు.
సోనియాను బలిదేవత అన్నది రేవంత్ రెడ్డినే
‘‘కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్‌మెంట్ ఉన్న కేసీఆర్‌కు పోలికా?’’ అని కేటీఆర్ విమర్శించారు. ‘‘1956లో తెలంగాణకు, ఆంధ్రాకు ఇష్టం లేని బలవంతపు పెండ్లి చేసిన పాపాత్ములు ఎవరు? 1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపిందెవరు? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి, కాంగ్రెస్‌లో కలుపుకున్నది వాస్తవం కాదా? 2004లో మాటిచ్చి 2014 దాకా 1,000 మందిని చంపింది వారు కాదా..? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు?” అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌కు, మా పార్టీకి తేడా ఏందంటే.. ‘బ్రిటిషోళ్ల మీద భారతీయులు కొట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నరు. బ్రిటిషోళ్లు మేం స్వాతంత్ర్యం ఇచ్చినం అంటే ఏమన్నా సిగ్గు ఉంటదా? చెప్పేందుకే ఎంత గలీజ్‌గా ఉంటది. అదొక్కటే కాదు.. నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటదో.. మాకు అంతే బాధ ఉంటది. మంత్రసాని పాత్ర పోషించిన వారే కాంగ్రెసోళ్లు. 1,000 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని అప్పట్లో రేవంత్‌రెడ్డి అన్నారు” అని దుయ్యబట్టారు.
చంద్రబాబు.. జగన్‌కు థ్యాంక్స్
తెలంగాణ అభివృద్ధి ఏపీలో ఉన్న జగన్‌కు, చంద్రబాబు నాయుడికి అర్థమవుతున్నదని, కానీ ఇక్కడున్న ప్రతిపక్ష నేతలకు అర్థం కావటం లేదని కేటీఆర్ కామెంట్ చేశారు. ‘‘సొంత రాష్ట్రం ముందుకు పోతుంటే మెచ్చుకునే ఓపిక ప్రతిపక్షాలకు లేదు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని చంద్రబాబు అన్నరు. అదే చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనచ్చునని అన్నరు. ఈ వేదిక ద్వారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐ థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు.. ఇక్కడ మంచి జరిగిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు” అని ఆయన అన్నారు. ‘‘తెలంగాణలో శాంతి భద్రతలను జగన్ మెచ్చుకున్నరు. దిశ సంఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. ఏపీ శాసనసభలో ఆయన ‘ఐ సెల్యూట్ కేసీఆర్’ అని అన్నరు. ఐ థ్యాంక్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి” అని పేర్కొన్నారు.
మేం వేసిన పునాదులతోనే అభివృద్ధి..
రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా.. కాంగ్రెస్ హయాంలో వేసిన పునాదుల ఫలితమే. మేం ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లైఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడంతోనే హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందింది. 2లక్షల డబుల్బెడ్రూం ఇండ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ పరిధిలో కనీసం లక్ష ఇండ్లను కూడా చూపించలేక పోయారు. మేం సంపద సృష్టిస్తే.. బీఆర్ఎస్ సర్కార్ భూములు అమ్ముతున్నది. ఓఆర్ఆర్ లీజును 30 ఏండ్ల పాటు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ లీజు ద్వారా వచ్చిన డబ్బు, పన్నుల రూపేణా వచ్చే డబ్బంతా ఇప్పుడే ఖర్చు చేస్తే.. రానున్న ప్రభుత్వాలకు ఆదాయ వనరులేం ఉంటయ్?
భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత