సెంట్రల్​ జాబ్​ రిక్రూట్​మెంట్​ పరీక్షలు తెలుగులోనూ పెట్టాలె : కేటీఆర్

సెంట్రల్​ జాబ్​ రిక్రూట్​మెంట్​ పరీక్షలు తెలుగులోనూ పెట్టాలె : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు కేవలం హిందీ, ఇంగ్లిష్​మీడియంలోనే నిర్వహించాలన్న నిర్ణయాన్ని సవరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నిమంత్రి కేటీఆర్ ​కోరారు. సీఆర్పీఎఫ్ ​రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​లో పరీక్ష కేవలం రెండు మీడియంలలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారని, దానిలో సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. తెలుగుతో పాటు గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ ఈ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హిందీ, ఇంగ్లిష్​ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఆయా మీడియంలలో చదువుకోని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.

దేశంలో గుర్తించిన 12 అధికారిక భాషల్లో నేషనల్​రిక్రూట్​మెంట్​ఏజెన్సీలు కామన్​ఎలిజిబులిటీ టెస్ట్​నిర్వహించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాయని, కానీ ఆ నిర్ణయం పూర్తిగా అమలు కావడం లేదని తెలిపారు. సీఆర్పీఎఫ్​నోటిఫికేషన్​ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో గుర్తించిన అధికారిక భాషలు ఎన్నో ఉన్నా కేవలం రెండు భాషల్లోనే రిక్రూట్​మెంట్​పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు సమాన అవకాశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.