బన్సీలాల్​పేట మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

బన్సీలాల్​పేట మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పద్మారావునగర్, వెలుగు: చారిత్రక, వారసత్వ కట్టడాలను కాపాడుకుని భావితరాలకు అందించడం మన బాధ్యత అని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ తో కలసి సోమవారం రాత్రి బన్సీలాల్​పేటలోని మెట్లబావిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేవలం కాంక్రీట్​తో నిర్మించిన ఎత్తైన భవనాలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్​లు ఉంటేనే గొప్ప నగరం కాదని, చారిత్రక కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించినప్పుడే అది గొప్పది అవుతుందన్నారు. సిటీలో ఇలాంటి పురాతన మెట్లబావులు 43 ఉన్నట్లు మేయర్​ విజయలక్ష్మి చెప్పారని, త్వరలో వాటిని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.10 కోట్లతో అభివృద్ధి చేసిన బన్సీలాల్ పేట మెట్లబావి గొప్ప పర్యాటక ప్రాంతంగా మారనుందన్నారు. 3,900 మెట్రిక్​ టన్నుల చెత్తను 830 ట్రిప్పుల్లో తరలించి, పూర్వ వైభవం వచ్చేందుకు కృషి చేసిన అధికారులు, సాహే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అభినందించారు. 

ఇక నుంచి మెట్లబావిని కాపాడుకునే బాధ్యత స్థానికులదే అన్నారు. మంత్రి కేటీఆర్ సంకల్పంతోనే మెట్లబావి అభివృద్ధి జరిగిందని మంత్రి తలసాని కొనియాడారు. పనుల్లో పాల్గొన్న జీహెచ్ఎంసీ సిబ్బంది, సహకరించిన స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభం కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శన చేసిన సంగీత అకాడమీ చైర్మన్​దీపికారెడ్డి బృందాన్ని కేటీఆర్​అభినందించారు. రిపేర్ల టైంలో లభ్యమైన వస్తువులను, పనుల తీరును తెలిపేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ చూశారు. మున్సిపల్ ప్రిన్సిపల్​సెక్రటరీ అరవింద్ కుమార్, మేయర్​విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.