భూపాలపల్లికి మంత్రి కేటీఆర్ వరాల జల్లు

 భూపాలపల్లికి మంత్రి కేటీఆర్ వరాల జల్లు

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన నిధులను మంజూరు చేస్తామని బహిరంగ సభ సాక్షిగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రూ.135 కోట్ల నిధులతో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.25 కోట్లు ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.300 కోట్ల రుణాలు అందిస్తామన్నారు. మరో రూ. 50 కోట్లు కూడా అందిస్తామన్నారు. ఇప్పటికే భూపాలపల్లిని జిల్లా చేశామని, మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. భూపాలపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటయ్యేలా మాట్లాడుతామని హామీ ఇచ్చారు. నాయకుడు అంటే ప్రజలకు ఏం కావాలో ఆలోచించాలన్నారు. ఆచార్య జయశంకర్ సార్ పై ఉన్న గౌరవంతో భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. 

కావాలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై, బీఆర్ఎస్ పై కక్షగట్టిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులకు ఉసిగొల్పుతోందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 2014లో అమలు కాని హామీలు ఎన్నో ఇచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. ‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మిషన్ భగరీథకు నిధులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంపై ప్రశంసలు ఉంటాయి తప్ప.. పైసలు మాత్రం ఇవ్వరు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.