నాకు సీఎం కావాలన్న పిచ్చి ఆలోచన లేదు : కేటీఆర్

నాకు సీఎం కావాలన్న పిచ్చి ఆలోచన లేదు : కేటీఆర్
  • మళ్లా కేసీఆరే సీఎం.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతం
  • రాహుల్​ ప్రధాని కాడు.. దోశలు వేసుకోవాల్సిందే : కేటీఆర్​
  • ఎన్నికలకు ముందే రేసులోంచి బీజేపీ తప్పుకుంది
  • ఆ పార్టీకి 110 సీట్లలో డిపాజిట్లు కూడా రావు
  • శివసేనతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్​ సెక్యులర్​ అని ఎట్లంటది?
  • ఎంఐఎం ఎక్కడా తాము ముస్లింల కోసమే అని చెప్పుకోలేదు
  • పదేండ్లలో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినం
  • ప్రవళిక ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నయ్​
  • ముదిరాజ్​లకు ఎమ్మెల్యేగా చాన్స్​ ఇవ్వలేకపోవచ్చు.. వేరే పదవులిస్తమని వ్యాఖ్య

పదేండ్లలో  మా ప్రభుత్వం లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. టీఎస్​పీఎస్సీ ఉద్యోగాల భర్తీని కాంగ్రెస్, బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నరు.  టీఎస్​పీఎస్సీ రిక్రూట్​మెంట్​లో చిన్న చిన్న లోపాలుంటే  సరి చేస్తం. ఏటా జాబ్​క్యాలెండర్ ​ప్రకటించి దానికి తగ్గట్టుగా జాబ్స్​ నింపుతం.  

హైదరాబాద్, వెలుగు : తనకు సీఎం కావాలన్న పిచ్చి ఆలోచన, ఎజెండా లేదని మంత్రి కేటీఆర్​అన్నారు. ‘‘నన్ను సీఎం చేస్తారన్నది ప్రతిపక్షాల ప్రచారమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. కేసీఆర్ హ్యాట్రిక్​ సీఎం అయితరు” అని ఆయన చెప్పారు. శనివారం బేగంపేట క్యాంపు ఆఫీసులో కేటీఆర్​ మీడియాతో చిట్​చాట్​చేశారు. రాహుల్​గాంధీ ప్రధాని అయ్యేది లేదని, దోశలు వేసుకుంటూ ఉండాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్​కు 40 చోట్ల అభ్యర్థులే లేరని, తమ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చుకొని బీఫామ్స్​ ఇస్తున్నదని విమర్శించారు. ఎన్నికలకు ముందే రేసులోంచి బీజేపీ తప్పుకున్నదని, ఈసారి ఆ పార్టీకి 110 స్థానాల్లో డిపాజిట్లు రావని, అందుకే పోటీ చేయడానికి కేంద్ర మంత్రి సహా కీలక నేతలంతా వెనుకాడుతున్నారని ఆయన కామెంట్​ చేశారు. 

ఆ సర్వే 2018లోనూ మేం ఓడిపోతమన్నది

అభ్యర్థులను ప్రకటించడం, బీఫామ్స్​ ఇవ్వ డం ఇట్ల అన్నిట్లో తామే ముందున్నామని, ఎన్నికల ఫలితాల్లోనూ ముందుంటామని కేటీఆర్​ అన్నారు.  ‘‘2018లో 88 స్థానాల్లో గెలిచినం.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తం. కేసీఆర్ పై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉంది. నేను గట్టిపోటీ ఉంటుందని అంచనా వేసుకున్న మంథని, రామగుండంలోనూ మా పార్టీనే లీడ్​లో ఉందని ఒక ఏజెన్సీ సర్వే రిపోర్టును ఇచ్చింది” అని పేర్కొన్నారు. 2018లోనూ సీ ఓటర్​సర్వే తాము ఓడిపోతామని చెప్పిందని, ఇప్పుడు అదే మాట చెప్పిందని, గతంలో గెలిచినట్టే ఇప్పుడు తమ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో చేశామని, ఈసారి 12కు 12 సీట్లలోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.  

2018లో ఖమ్మంలో లీడర్లందరూ పార్టీలోనే ఉన్నా  గెలిచింది ఒక్క సీటు మాత్రమేనని, ఇప్పుడు వాళ్లంతా పోయారు కాబట్టి ఎక్కువ సీట్లే గెలుస్తామని అన్నారు. ‘‘పార్టీ అనేది వ్యవస్థగా నడవాలే తప్ప ఒకరిద్దరు వ్యక్తులు తామే సుప్రీం.. తాము చెప్పిందే నడువాలనే రాజకీయాలను కేసీఆర్​ ఏమాత్రం ఉపేక్షించబోరు. ఖమ్మంలో కొందరు అలా డిక్టేట్​చేయాలని చూశారు..  వాళ్లను వదిలించుకున్నం” అని పేర్కొన్నారు. 

కేంద్రంలో బీజేపీని గద్దె దించుతం

దేశంలోనే అన్ని రంగాలకు 24 గంటల కరెంట్​సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇక్కడ కరెంట్​కష్టాలు తేవాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని, ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని కేటీఆర్​ ఆరోపించారు.  డిస్కంలపై కేంద్రం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నదని అన్నారు.  ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపైనే ఇప్పుడు మా దృష్టంతా ఉంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ వెకిలి రాజకీయాలకు చెక్​పెట్టడానికి, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రయత్నిస్తం.

కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమికే ఏదో ఒక జాతీయ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది” అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల రేసులోనే బీజేపీ లేదని, ఈటల రాజేందర్​హుజూరాబాద్​తో పాటు గజ్వేల్​లోనూ ఓడిపోతారని కేటీఆర్​ అన్నారు. ‘‘చత్తీస్​గఢ్​ స్టార్​ క్యాంపెయినర్​అని చెప్పుకుంటున్న బండి సంజయ్​అక్కిడికి పోయి ఏ భాషలో ప్రచారం చేస్తరు? తనకు హిందీ రాదని ఆయనే చెప్పారు కదా” అని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్​ సెక్యులర్​ అని ఎట్లంటది?

ఉదయ్ పూర్ డిక్లరేషన్ నే కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని, అలాంటి పార్టీ ఇచ్చిన గ్యారంటీ లను అమలు చేస్తదన్న గ్యారంటీ  ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘‘ఏఐసీసీ చీఫ్​ ఖర్గేను మూలకు కూర్చోబెట్టి రాహుల్ గాంధీ ఏ హోదాలో ప్రజలకు హామీలిస్తున్నారో చెప్పాలి” అని మండిపడ్డారు.  కాంగ్రెస్​పాలనకు తమ తొమ్మిదిన్నరేండ్ల పాలనకు అసలు పోలికే లేదని, మెడికల్​కాలేజీలు, ఇరిగేషన్​, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించామని కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలో సాండ్​మాఫియా నడుస్తున్నదని రాహుల్​గాంధీ అనడం విచిత్రంగా ఉందని,  ఇసుక ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం చూస్తేనే అవి వట్టి ఆరోపణలు అని తేలిపోతాయని పేర్కొన్నారు.

దేశంలోనే అద్భుతమైన ఇసుక పాలసీ తెలంగాణలోనే ఉందని అన్నారు.  ‘‘హిందుత్వ పార్టీ అయిన శివసేనతో మహారాష్ట్రలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్​ఇక్కడికి వచ్చి సెక్యులర్​ఎట్ల అంటుంది?” అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ ఎవరికీ బీ టీమ్​ కాదని, కాంగ్రెస్​పార్టీనే దేశానికి చోర్​టీమ్ అని, కాంగ్రెస్​ అంటేనే కుంభకోణాల కుంభమేళా​అని కేటీఆర్​ దుయ్యబట్టారు.  ‘‘ఎంఐఎం ఎక్కడా తమ పార్టీ ముస్లింల కోసమే అని చెప్పుకోలేదు. అయినా అది మా  ఫ్రెండ్లీ పార్టీనే తప్ప ఆ పార్టీతో అలయన్స్​లో లేం. రాహుల్ గాంధీ, మోదీ పార్లమెంట్​లో కౌగిలించుకున్నరు..

ఎన్నికల్లో అవసరమైన చోట ఒక పార్టీ కోసం ఇంకో పార్టీ కలిసి పని చేసిన ఉదంతాలెన్నో ఉన్నయ్” అని వ్యాఖ్యానించారు. తాము బీజేపీకి బీ టీమ్​ అయితే దేశంలోనే మైనార్టీల కోసం అత్యధిక బడ్జెట్​ఎలా ఖర్చు చేస్తామో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘రాహుల్​గాంధీవి లేకి మాటలైతే.. ప్రధాని మోదీ నోరు తెరిస్తేనే అబద్ధాలు” అని దుయ్యబట్టారు. 

ప్రవళిక తమ్ముడికి జాబ్​ ఇస్తా అన్లే.. సహకరిస్త అన్న

ప్రవళిక ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాయని, తాము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చామని కేటీఆర్​ అన్నారు. ‘‘ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిని అరెస్ట్​ చేసినట్టుగా వార్తల్లో చూసిన. ఆమె తమ్ముడికి నేను ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా కొందరు తప్పుడు వార్తలు రాశారు. ఆ అబ్బాయి ఇంకా చదువుకుంటున్నడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చేందుకు సహకరిస్తమని మాత్రమే చెప్పిన” అని ఆయన తెలిపారు.