సానియా టెన్నిస్కు గుడ్ బై చెప్పడం బాధగా ఉంది: మంత్రి కేటీఆర్

సానియా టెన్నిస్కు గుడ్ బై చెప్పడం బాధగా ఉంది: మంత్రి కేటీఆర్

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్లో రాణించి తెలంగాణతో పాటు దేశానికి సానియా మీర్జా ఎంతో పేరు తెచ్చిందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 22 ఏళ్ల క్రితం ఎల్బీ స్టేడియంలో తొలి టెన్నిన్ మ్యాచ్ ఆడిన సానియా మీర్జా..చివరి మ్యాచ్ ఇక్కడే ఆడటం సంతోషంగా ఉందన్నారు. సానియా టెన్నిస్ కు గుడ్ బై చెప్పడం బాధగా ఉన్నా..భవిష్యత్లో  తన లాంటి ప్లేయర్లను తీర్చిదిద్దాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సానియా మీర్జా ఫేర్ వల్ మ్యాచ్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్ చూసినట్లు చెప్పారు. 

క్రీడా పాలసీ తీసుకొస్తం

సానియా మీర్జా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ బిడ్డ..మధ్య తరగతిలో పుట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని మెచ్చుకున్నారు. తన ఆటతో దేశానికి పేరు ప్రతిష్టలు సంపాదించడంతో పాటు..ఎన్నో పతకాలను సాధించిందని కొనియాడారు. క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.  క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశానికి ఎంతో మంది క్రీడాకారులను అందిస్తామన్నారు.  సానియా సేవలు తెలంగాణకు ఎంతో అవసరమన్నారు. 

సానియా కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నా..

సానియా 30 ఏళ్ల కెరీర్ తో సంతృప్తిగా ఉన్నానని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా అన్నారు. సానియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. సరైన  ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో టెన్నిస్ లో మరో సానియా రాలేకపోయిందన్నారు. సానియా భవిష్యత్ గురించి ఆమెనే ఆలోచించుకుంటుందని చెప్పారు. సానియా అకాడమీ ద్వారా మరి కొంత మంది  టెన్నిస్ ప్లేయర్లను తీసుకొస్తదని ధీమా వ్యక్తం చేశారు. 

టెన్నిస్ కు వీడ్కోలు..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికింది. ఫిబ్రవరి 21న దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో టెన్నిస్  కెరీర్ గుడ్ బై చెప్పిన సానియా...ఆదివారం సొంత గడ్డ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో  ఫేర్‌వెల్‌  మ్యాచ్‌ ఆడింది. త‌న చివ‌రి మ్యాచ్‌ సింగిల్స్‌లో సానియా-- రోహన్ బోపన్న,  డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ వర్సెస్ ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ త‌ల‌ప‌డ్డారు. ఈ మ్యాచ్ లో సానియా జోడీ విజయం సాధించింది. సానియా మ్యాచ్ చూసేందుు అభిమానులు, కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా  భావోద్వేగానికి లోనై కంట‌త‌డి పెట్టింది. 

బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించా..

సొంత గడ్డపై అభిమానుల సమక్షంలో టెన్నిస్ కు వీడ్కోలు పలకడం సంతోషంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. ఇన్నాళ్లు ఆటకు అంకితమైన తాను..ఇక భవిష్యత్‌ తరాన్ని తీర్చిదిద్దడం కోసం తన  సమయాన్ని వెచ్చిస్తానని చెప్పింది. సినిమాలపై తనకు  ఆసక్తి లేదని....బాలీవుడ్ ఆఫర్ వచ్చినా తిరస్కరించానని వెల్లడించింది. ముఖ్యంగా వింబుల్డన్‌ జూనియర్‌ ఛాంపియన్ షిప్ గెలిచాక  హైదరాబాద్ కు వచ్చిన తనకు అభిమానులు  పలికిన స్వాగతాన్ని  ఎప్పటికీ మరవలేనని చెప్పింది. 

సానియా కెరీర్..

2003లో టెన్నిస్‌ లోకి అడుగుపెట్టిన  సానియా మీర్జా.... తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. మార్టినా హింగిస్‌తో కలిసి మూడు ఉమెన్స్ డబుల్స్ టైటిల్స్  సాధించింది. మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచింది. వాటిలో రెండు మహేష్ భూపతితో కలిసి సాధించింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవగా....2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుంది. బ్రూనో సోరెస్‌తో కలిసి యూఎస్ ఓపెన్ ట్రోఫీని సాధించింది. మొత్తం 43 WTA టైటిళ్లు సాధించింది. డబుల్స్ లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ ర్యాంకులో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఎనిమిది, కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు పతకాలు దక్కించుకుంది. 2004లో అర్జున, 2015లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులను సానియా దక్కించుకోగా...ఆ తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్‌ కూడా పొందింది.