
నిర్మల్/ భైంసా, వెలుగు: భవిష్యత్ అంతా త్రీడీదేనని, సైబర్ ప్రపంచం వైపు సమాజం వేగంగా అడుగులు వేస్తున్నదని, అందులో భాగంగానే మన స్టూడెంట్లు గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఐదో కాన్వొకేషన్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. స్టూడెంట్లకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలు అందజేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సైబర్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర సర్కారు చేస్తున్న కృషి కారణంగానే తెలంగాణ స్టూడెంట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక రంగాన్ని శాసించే రేంజ్‌కు ఎదగడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ ముందు నుంచే సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
ట్రిపుల్ఐటీకి రూ. 27కోట్లు
ట్రిపుల్ ఐటీని మరింత డెవలప్ చేసేందుకు అధికారులు రూ.25కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేస్తే.. కేసీఆర్ అదనంగా మరో రూ.2కోట్లు కలిపి మొత్తం రూ.27 కోట్లు మంజూరు చేసినట్టు కేటీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ట్రిపుల్ ఐటీలోని 2,250 స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు అందజేశామన్నారు. క్యాంపస్‌కు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, రూ.5కోట్లతో సైన్స్ బ్లాక్ నిర్మిస్తామన్నారు. బాలికల కోసం పది పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘‘మన ఆర్జీయూకేటీ–మన బాధ్యత’’అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. 1,500 మంది స్టూడెంట్స్‌కు డెస్క్ టాప్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. తర్వాత 38 మంది స్టూడెంట్స్‌కు గోల్డ్ మెడల్స్, 550 మందికి డిగ్రీ పట్టాలందజేశారు.
మెస్ వ్యవహారంలో.. వీసీపై కేటీఆర్ సీరియస్
మెస్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీసీ వెంకటరమణతో పాటు సంబంధిత అధికారులపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆరు నెలల నుంచి మెస్ టెండర్ల వ్యవహారం ఎందుకు ఫైనల్ చేయలేదని ప్రశ్నించారు. స్నాతకోత్సవానికి ముందు కాన్ఫరెన్స్ హాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అధికారులతో కేటీఆర్ భేటీ అయ్యారు. గతంలో ఇచ్చిన హామీల గురించి వీసీని అడిగి తెలుసుకున్నారు. మెస్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పడంతో కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మెస్‌ను వెంటనే కొత్త ఏజెన్సీలకు అప్పగించి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఫిబ్రవరిలోగా మళ్లీ వచ్చి పరిస్థితిని సమీక్షిస్తానని స్పష్టం చేశారు.
ఎస్జీసీ స్టూడెంట్స్‌ను పట్టించుకోని కేటీఆర్
ఎంపిక చేసిన స్టూడెంట్స్‌నే ఆఫీసర్లు కాన్వొకేషన్‌కు అనుమతించారు. రెండో శనివారం హాలిడే కావడంతో మిగిలిన స్టూడెంట్స్ హాస్టల్స్‌కు పరిమితం అయ్యారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌లోని ఓ స్టూడెంట్ కేటీఆర్‌ను కలిసేందుకు చాలా ప్రయత్నించాడు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినా.. కేటీఆర్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
ఐటీ హబ్‌గా ట్రిపుల్ ఐటీ
మంత్రి కేటీఆర్ సహకారంతో ట్రిపుల్ ఐటీని ఐటీ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసు కుంటాం. జాతీయ విద్యా సంస్థలతో పోలిస్తే ఇక్కడి స్టూడెంట్లకు మెరుగైన విద్య అందిస్తు న్నాం. సమస్యల పరిష్కారంపై వేసిన కమిటీ ఆధారంగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం.
- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
దేశానికే తలమానికం
బాసర ట్రిపుల్ ఐటీ దేశానికే తలమానికంగా నిలుస్తున్నది. ఏ చిన్న సమస్య ఉన్నా.. క్యాంపస్ ఆఫీసర్లకు చెప్పుకొని పరిష్కరించుకోవాలి. మరిన్ని సౌలత్లు కల్పించేందుకు కేసీఆర్, కేటీఆర్ సహకారంతో నిధులు కేటాయిస్తాం.
- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి