వరల్డ్ కప్​లో ఇండియా.. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుసుడు పక్కా : కేటీఆర్

వరల్డ్ కప్​లో ఇండియా.. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుసుడు పక్కా : కేటీఆర్
  • బీఆర్ఎస్​తోనే  హైదరాబాద్ అభివృద్ధి

హైదరాబాద్/ ఖైరతాబాద్, వెలుగు: ఇండియా వరల్డ్ కప్​ను గెలవడం, తెలంగాణలో బీఆర్ఎస్ గెలవడం పక్కా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు, షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసినట్లు మనం కూడా వంద స్థానాలతో హ్యాట్రిక్ కొడతాం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్​లో ప్రశాంతమైన వాతావరణం ఉందన్నారు. నీరు, కరెంట్ అన్ని సరిగ్గా వస్తున్నాయన్నారు. రోడ్లు, డ్రైనేజీలు బాగు చేశామని, ఇంకా కొన్ని బాగు చేయాల్సినవి ఉన్నాయన్నారు. మెట్రోను విస్తరింపజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్​ పాలనలోనే నగరంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. 

ఢిల్లీ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవద్దు

ఢిల్లీ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవద్దని కేటీఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్​లో ఏ ఒక్క నాయకుడికి అయినా కేసీఆర్​కు ఉన్న చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. ఇంకా ఎన్నికలే జరగలేదు అప్పడే ఆ పార్టీలో సీఎం కుర్చీ కోసం కొట్లాటలు మొదలయ్యాయన్నారు. దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని కాదని, కాంగ్రెస్ అజారుద్దీన్​కు టికెట్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. 

క్రికెటర్​గా అజారుద్దీన్ అంటే నాకు ఇష్టమే.. సెలబ్రిటీలు, క్రికెటర్లతో ఫొటో దిగాలి ఓటు వేయకూడదని తెలిపారు. జూబ్లీహిల్స్​లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని కేటీఆర్ అన్నారు. ప్రతి భారతీయుడి జన్​ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ.. మాట తప్పారని విమర్శించారు.