అమరుల త్యాగాలు మరువలేం

అమరుల త్యాగాలు మరువలేం
  • తెలంగాణలో అశాంతి సృష్టించే కుట్ర
  • అమరుల త్యాగాలు మరువలేం
  • వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ 

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: తెలంగాణలో మతతత్వ శక్తులు అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాజన్న సిరిసిల్లలోని కలెక్టరేట్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో హైదరాబాద్‌ విలీనమైందన్నారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేనివన్నారు.

1948 నుంచి 1956 వరకు తెలంగాణ రాష్ట్రంగా ఉందని, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పేరిట హైదరాబాద్ ను బలవంతంగా ఏపీలో కలిపారని అన్నారు. సీఎం కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ ప్రజలను ఏకం చేశారన్నారు. అనంతరం మంత్రి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. న్యాక్ శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలకు 25 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్​టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, ఎమ్మెల్యే రమేశ్​బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు మున్సిపల్ చైర్ పర్సన్ కళా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.