కేసీఆర్ వెనక్కి.. కేటీఆర్ ముందుకు!

కేసీఆర్ వెనక్కి..  కేటీఆర్ ముందుకు!
  • రూటు మార్చిన బీఆర్ఎస్ సర్కారు

గతంలో కేంద్ర సమావేశాలకు సీఎం డుమ్మాలుఇప్పుడు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీలు.. వినతి పత్రాలు కేంద్రం నిర్వహించే మీటింగ్‌‌లకు హాజరయ్యేందుకు రెడీ

హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాకా ప్రధాని, కేంద్రం నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొడుతూ వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రూటు మార్చింది. కేంద్ర మంత్రులను కలవడంతోపాటు కేంద్రం నిర్వహించే మీటింగ్‌‌లకూ అటెండ్ అవుతున్నది. అయితే ఈ విషయంలో సీఎం తెరవెనుకే ఉన్నప్పటికీ.. అనుహ్యంగా మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌తో భేటీ అయ్యారు. స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్​ భూములు ఇవ్వాలని కోరారు. హోంశాఖ పరిధిలోని భూముల కోసం, విభజన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ కేటీఆర్ భేటీ అయ్యే చాన్స్ ఉంది. ఇందుకోసం అపాయింట్‌‌మెంట్ కూడా తీసుకున్నారు. 

కేసీఆర్ వెనక్కి.. కేటీఆర్ ముందుకు!
 

ఇంకోవైపు ఢిల్లీలో శనివారం కేంద్ర హోం శాఖ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హాజరుకానున్నారు. కేటీఆర్ కూడా సీఎం ఆదేశాలతోనే కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు ఇస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్‌‌‌‌ను కేసీఆరే ముందుకు నడిపిస్తున్నారని అటు పార్టీ, ఇటు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇకపై కేంద్రం పెట్టే అన్ని మీటింగ్‌‌లకు వెళ్లాలా? లేదా ఇది తాత్కాలికమేనా? అనే గందరగోళంలో అధికారులు ఉన్నారు. 2018లోనూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ ఇలాగే ఢిల్లీ వెళ్లి వివిధ అంశాలపై కేంద్రంలోని పెద్దలను కలిశారని గుర్తు చేస్తున్నారు. 

అప్పటి నుంచి దూరం 

దాదాపు ఏడాదిన్నరగా కేంద్రం నిర్వహించిన నీతి ఆయోగ్, జీఎస్టీ కౌన్సిల్, సదరన్ మీటింగ్‌‌లకు రాష్ట్ర ప్రభుత్వం డుమ్మా కొడుతూ వచ్చింది. సీఎం కేసీఆర్ హాజరుకావాల్సిన మీటింగ్‌‌లకు కూడా వెళ్లలేదు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అధికారిక పర్యటన సమయంలోనూ కేసీఆర్ అటెండ్ కాలేదు. గతేడాది ఫిబ్రవరి 5న జరిగిన సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం నుంచి పీఎం మోదీ టూర్లకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. విగ్రహావిష్కరణకు మోదీ వస్తున్నారనే కారణంతో కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. ఆ సమయంలో సీఎంకు జ్వరం వచ్చిందని, జలుబు చేసిందని ప్రగతిభవన్ వర్గాలు లీకులు ఇచ్చాయి. మళ్లీ మేలో ఇండియన్ బిజినెస్ స్కూల్ స్నాతకోత్సవానికి ప్రధాని వచ్చారు. ఈ ప్రోగ్రామ్‌‌కూ కేసీఆర్ వెళ్లలేదు. నవంబర్‌‌లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి ప్రధాని అంకితం చేశారు. అక్కడకు సీఎంను ఆహ్వానించినా, ఆయన తరఫున స్థానిక మంత్రిని పంపారు. 

గతేడాది ఆగస్టులో పీఎం అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ వెళ్లలేదు. సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే తీరులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, రాష్ట్రాల అభిప్రాయాలకు విలువ ఇవ్వని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం నిరర్థకమని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని విమర్శించి, చాయ్​బిస్కెట్ల మీటింగ్‌‌ అంటూ దాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించి పీఎంకు లెటర్ రాశారు. ఇటీవల ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కొత్త పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేసే కార్యక్రమానికి బీఆర్ఎస్ దూరంగానే ఉన్నది. కానీ ఇప్పుడు కేటీఆర్‌‌‌‌ సడన్​గా విజ్ఞప్తులు పట్టుకుని కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.