కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్​ లేఖ

కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్​ లేఖ

ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు: కేటీఆర్​

హైదరాబాద్‌‌, వెలుగు : బల్క్‌‌ డ్రగ్‌‌ పార్క్‌‌ల కేటాయింపులో మోడీ ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందని, ఉద్దేశపూర్వకంగానే ఫార్మాసిటీని ఈ పార్క్‌‌ల కేటాయింపులో విస్మరించారని మంత్రి కేటీఆర్‌‌ ఆరోపించారు. రాష్ట్రానికి బల్క్‌‌ డ్రగ్‌‌ పార్క్‌‌ కేటాయించాలని కోరుతూ కేంద్ర కెమికల్‌‌, ఫర్టిలైజర్‌‌ శాఖ మంత్రి మన్సూక్‌‌ మాండవీయకు శుక్రవారం లెటర్ రాశారు. ఏపీ, హిమాచల్‌‌ప్రదేశ్‌‌, గుజరాత్‌‌లకు ఈ పార్క్‌‌లను కేటాయించి తెలంగాణపై వివక్ష చూపారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫార్మాసిటీని కనీసం పరిశీలించకపోవడం సరికాదన్నారు.

దేశంలో ఫార్మా రంగం స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో 2 వేల ఎకరాల్లో అనేక సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి బల్క్‌‌ డ్రగ్‌‌ ఇండస్ట్రీ ఏర్పాటు అంశాన్ని కేంద్రం 2015లో తెరపైకి తీసుకువచ్చి ఆ తర్వాత విస్మరించిందన్నారు. పార్క్‌‌ స్థాపనకు అనువుగా ఉన్న తెలంగాణను కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఫార్మాసిటీని గతంలో ప్రశంసించిన కేంద్రమే ఇప్పుడు పార్క్‌‌ ఇవ్వకపోవడంపై అనేక అనుమానాలున్నాయన్నారు.  కేంద్రం తీరుతో రాష్ట్రంలో ఫార్మారంగం పురోగతి దారుణంగా దెబ్బతింటుందని, దీనిపై పునరాలోచన చేయాలని కోరారు.