ఇది ట్రైలర్ మాత్రమే.. కాంగ్రెస్ లీడర్లకు మల్లన్న సినిమా చూపిస్తా : మంత్రి మల్లారెడ్డి

ఇది ట్రైలర్ మాత్రమే.. కాంగ్రెస్ లీడర్లకు మల్లన్న  సినిమా చూపిస్తా : మంత్రి మల్లారెడ్డి
  • మల్కాజిగిరి ప్రజలకు ఇక మంచి రోజులే
  • అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి భారీ బలప్రదర్శన

సికింద్రాబాద్, వెలుగు:  మల్కాజిగిరిలో కాంగ్రెస్ లీడర్లు ఇప్పటిదాకా చూసింది ట్రైలర్ మాత్రమే అని, మల్లన్న సినిమా ఏంటో ముందు ముందు చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇంత కాలం రావణుడి రాజ్యంలో ఇబ్బందులుపడ్డ నియోజకవర్గ ప్రజలకు ఇక నుంచి అన్నీ మంచిరోజులే అని చెప్పారు. దసరా పండుగ వస్తున్నదని, రావణ దహనం చేద్దామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావును ఉద్దేశిస్తూ మంత్రి మల్లారెడ్డి పరోక్షంగా విమర్శించారు. బీఆర్ఎస్​కు 
మైనంపల్లి రాజీనామా చేయడంతో మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం బలప్రదర్శన చేపట్టారు.

 ఆనంద్​బాగ్ నుంచి మల్కాజ్​గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా అల్లుడు, కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్ అంటేనే రామరాజ్యం. మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్ రెడ్డి వస్తున్నడు. లక్ష మెజార్టీతో గెలిపించాలి. 70 రోజులు ఓపికపట్టండి.. అధైర్య పడకండి.. మీకంతా మంచే జరుగుతది. ఇప్పటిదాకా ఆగిపోయిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు లాంటి అన్ని స్కీమ్​లు రేపటి నుంచి ప్రజలకు నేను అందిస్తా”అని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు.

రేవంత్ రెడ్డి నాలుగేండ్లు ఏం చేసిండు?

మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేశాడా? అని మంత్రి మల్లారెడ్డి ప్రజలను ప్రశ్నించారు. నాలుగేండ్లుగా నియోజకవర్గంలో పర్యటించాడా? అని అన్నారు. డబ్బులతో పీసీసీ పదవి కొనుక్కొని ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. తర్వాత మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. మల్కాజిగిరి ప్రజలు తనను ఆశీర్వదించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

బలప్రదర్శనకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు డుమ్మా

మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బలప్రదర్శనకు ముగ్గురు పార్టీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ఈ బల ప్రదర్శనకు నియోజకవర్గపరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులంతా తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఆదేశించినా.. ఎమ్మెల్యే హన్మంత రావుకు నమ్మిన వ్యక్తులుగా ఉన్న కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, ప్రేమ్​కుమార్, సబితా అనిల్ కిశోర్ మాత్రం అటెండ్ కాలేదు. ఈ ముగ్గురిలో ఇద్దరు కార్పొరేటర్లు హన్మంత రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లగా.. మరొకరు వ్యక్తిగత కారణాలతో బలప్రదర్శనకు హాజరుకాలేదని సమాచారం.