చిన్నారి కేసు : పాప ఇంటికి చేరుకున్న మంత్రి మల్లారెడ్డి

చిన్నారి కేసు : పాప ఇంటికి చేరుకున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. బాధిత కుటుంబానికి పరామార్శించేందుకు మంత్రి మల్లారెడ్డి కాసేపటిక్రితమే వారి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు కాసేపట్లో ఇందు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. అయితే ప్రభుత్వం నుంచి భరోసా వచ్చాకే మృతదేహాన్ని తరలిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.  తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని బంధువులు స్పష్టం చేశారు. స్థానిక నాయకుల మరోసారి ధర్నా చేసే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మొహరించారు.

ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 టీమ్స్ ను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. కేసు విచారణలో భాగంగా తల్లిదండ్రుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కేసును విచారిస్తున్నారు. మరోవైపు జవహర్ నగర్ స్మశాన వాటికలో ఇవాళ చిన్నారి ఇందు అంత్యక్రియలు
జరగనున్నాయి. ఈరోజు కూడా నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

చెడు వ్యసనాలకు గురైన కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు బాలిక అనుమానాస్పద మృతి కేసులో.. పోస్ట్ మార్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోను రికార్డింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగవత్ హెచ్చరించారు.