రోజూ సీఎంతో ఉంటే..సీఎం అయితనా?

రోజూ సీఎంతో ఉంటే..సీఎం అయితనా?

 

  • ఆశకూ ఓ హద్దు ఉండాలె

  • నేను బీజేపీతో టచ్ లో ఉన్నానడం కరెక్ట్ కాదు

  • నేను కాంగ్రెస్ లో జూనియర్ ను కాదు సబ్ జూనియర్

  • మా ప్రభుత్వంలో నో ఫోన్ ట్యాపింగ్

  • మేం గేట్లు ఎత్తలేదు.. ఎత్తితే వరద ఆగదు

  • 12 ఎంపీ సీట్లు పక్కాగా గెలుస్తం

  • మంత్రి పొంగులేటి చిట్ చాట్ 

హైదరాబాద్: ‘రోజూ  సీఎంతో ఉంటే సీఎంను అవుతానా.. ఆశకూ ఓ హద్దుండాలె.. నేను బీజేపీతో టచ్ లో ఉన్నానంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో జూనియర్ ను కాదు.. సబ్ జూనియర్ ను మాత్రమే..’ అని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను బీజేపీతో టచ్ లో ఉన్నాననటం సరికాదన్నారు. ఎన్నికల తర్వాత సీఎం అవుతానంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజూ సీఎంతో కనిపిస్తే నంబర్ 2 అంటారా? అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లలో విజయం సాధించబోతోందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లకు మించి గెలవదని చెప్పారు. తాము బీఆర్ఎస్ లీడర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామనే ఆరోపణలో నిజం లేదని, పదేండ్లలో వాళ్లు చేసిన తప్పులు అందరికీ కనిపిస్తున్నాయని అన్నారు. 

బిఆరెస్ ఎమ్మెల్యేలు, నేతలు  ప్రభుత్వం కూలుతుంది, కూలగొడతం అని చెబుతున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. తామింకా గేట్లు ఎత్తలేదని, ఎత్తితే వరద ఆగదని అన్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరాలని అడగడం లేదని, వారికి వారు స్వచ్ఛందంగా వస్తున్నారని మంత్రి చెప్పారు. ఇప్పుడున్న పరస్థితిలో బీఆర్ఎస్ ఒకటి  రెండు సీట్లు గెలవడం కూడా కష్టమేనన్నారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని ఎంఐఎం తమకు మద్దతు తెలుపుతోందని అన్నారు.  గత ప్రభుత్వానికి సంబంధించి మూడు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశామని, నిత్యం అవినీతిపై మాట్లాడటం కరెక్ట్ కాదని అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని చెప్పారు.  తాము చెప్పిందే చేస్తున్నామని, గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే..డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నామని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకు వెనుకాడబోమని అన్నారు.  

ధరణిపై శ్వేతపత్రం

ధరణిలో ఎవరెవరికి భూములు మారాయో మొత్తం ఆధారాలతో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.  పదేండ్లుగా ధరణిని రహస్యంగా ఉంచారని, ధరణి కమిటీ నుంచి సలహాలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పారు. తాము ఫోన్లు ట్యాపింగ్ చేయబోమని, ప్రజలు స్వేచ్ఛ కావాలని తమకు అధికారం ఇచ్చారని అన్నారు. 

జర్నలిస్టుల సమస్యలపై..

గత పదేండ్లుగా సమాచారశాఖ మంత్రే లేరని, కాంగ్రెస్ వచ్చాక ఆ పోస్టు వచ్చిందని అన్నారు.  జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని పొంగులేటి చెప్పారు. అన్ని సమస్యలనూ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. మిగతా  రాష్ట్రాల్లో మాదిరిగా జర్నలిస్టుల హెల్త్ స్కీం అమలు చేద్దామని అన్నారు.

Also Read : మోదీ మెజారిటీని నిర్దేశించే ఎలక్షన్స్