
- భూ సమస్య పరిష్కారానికి ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు
కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: భూసమస్యలను పరిష్కరించేందుకు జూన్ 2 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామంలో సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తహసీల్దార్ స్థాయి అధికారులు ప్రతి గ్రామానికి వస్తారని, ఒక్క రూపాయి ఫీజు కూడా ఎవరికీ చెల్లించాల్సిన పనిలేదని, శాశ్వతంగా భూసమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో భూభారతి పైలట్ మండలంగా ఎంపికైన సైదాపూర్ మండలం ఘనపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
సైదాపూర్ మండలంలో నిర్వహించిన సదస్సులో పొంగులేటి మాట్లాడుతూ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 1600 దరఖాస్తులు వచ్చాయని, న్యాయమైన సమస్యలన్నింటిని భూభారతి ద్వారా అధికారులు తప్పక పరిష్కరిస్తారని వివరించారు. ధరణిలో చిన్నచిన్న పొరపాట్లను కూడా సవరించే అవకాశం లేకపోయిందన్నారు. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలోనే సర్వే చేయించి ఆ మ్యాప్ ను పాస్ పుస్తకాల్లో అప్ లోడ్ చేస్తామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 6000 మంది సర్వేయర్లకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి చొప్పున 10,956 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విధులు నిర్వహించనున్నారని వెల్లడించారు. ఆనాటి ధరణి పెద్దల చట్టమని, నేటి భూభారతి పేదల చట్టమన్నారు. తహసీల్దార్ స్థాయి నుంచి నుంచి సీసీఎల్ఏ వరకు 5 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్న 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది అభిప్రాయాలు తెలుసుకొని భూ భారతి చట్టం తయారు చేశామన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే 80 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయన్నారు. విడతల వారీగా ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ కలెక్టర్ పమేలాసత్పతి, సీపీ గౌస్ ఆలం, లైబ్రరీ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, అన్నయ్య గౌడ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.