కూసుమంచి/ ఖమ్మం రూరల్/ వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో వర్షాలు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం మండలాలల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
పంట, ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 117 గ్రామాల్లో 67 వేల మంది ప్రభావితమయ్యారని, ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 10,538 మందిని తరలించినట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో 3,039 మందిని రక్షించగలిగామని తెలిపారు. 44 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా, 600 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు.
51 బ్రిడ్జిలు, 249 కల్వర్టులు, 166 ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని, 13,342 జీవాలు చనిపోయాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీటికి లోటు లేకుండా చూడాలన్నారు. మానవీయ కోణంలో సహాయ చర్యలు చేపట్టాలని, వృద్దులు, గర్భిణులు, పసిపిల్లలు, దివ్యాంగుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదలు తగ్గుముఖం పట్టి బురదమయమైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.