
- ఆ గోసనే దొరను ఫామ్ హౌస్ కు పంపింది
- ఆ నలుగురి కోసమే ధరణి చట్టం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సంగారెడ్డి, వెలుగు: గడిచిన పదేళ్లపాటు గత ప్రభుత్వ పెద్దలు ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని చేసిన కబ్జాలు, భూభాగోతాలు అన్ని త్వరలో బయటకు తీస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో రియల్టర్లు చేసిన మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండడంతో కబ్జాదారులు హైదరాబాద్ ను వదిలి వెళ్లారన్నారు. రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపులో ఉందని మరికొన్ని రోజుల్లో అది మరింత పుంజుకునే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు. శనివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
ధరణి కారణంగా గోసపడ్డ ప్రజల ఉసురు తగిలి పెద్దాయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు. ధరణిలో జరిగిన తప్పిదాలతో ప్రజలు విసుగెత్తి భూభారతిని తీసుకురావాలని ప్రజలు కోరడం వల్లే ఈ చట్టం వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే అనేక సవరణలతో భూభారతి ఆవిర్భవించి పేద ప్రజలకు న్యాయం చేస్తుందని మంత్రి వెల్లడించారు.
అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి సంగారెడ్డి ఎంపీపీ ఆఫీసులో ఇందిరమ్మ ఇళ్ల నమూనను ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి ఐబీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి మంత్రులు పొంగులేటి, దామోదర్ ను కలిసి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫైయిమ్, కలెక్టర్ క్రాంతి, ఎస్పీ పరతోష్ పంకజ్ పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిచేసి ఇస్తాం
చిలప్ చెడ్/ కౌడిపల్లి: గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం శీలంపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి రైతులను గోస పెట్టిందని, అలా ఈ ప్రభుత్వం ఉండకూడదని సూచించారు. రెవెన్యూ పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాను విభజించారని, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీస్, పీఎస్‌లకు సొంత భవనాలు లేక ఇబ్బందిగా ఉందన్నారు. ఆయా చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
గౌతాపూర్ గ్రామంలో 10 ఏళ్ల నుంచి గిరిజన రైతులకు పట్టా పాస్ బుక్కు లేక పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో లేరన్నారు. వారికి పాస్ బుక్ లు ఇప్పించి సమస్యను పరిష్కరించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా చిలప్ చెడ్ మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను మంత్రి శ్రీనివాస్ రెడ్డి అందించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసిని రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల కబ్జాపై మంత్రికి ఫిర్యాదు
శివ్వంపేట: మండలంలో అనేక ప్రభుత్వ, దేవాదాయ, ఫారెస్ట్ భూములు కబ్జాకు గురయ్యాయని డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ శనివారం చిలప్ చెడ్ కు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ అక్రమార్కులకు సహకరించి అక్రమంగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేశాడని మంత్రికి తెలిపారు. నర్సాపూర్ మండలంలో కూడా అనేక ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన మంత్రి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇదిలా ఉండగా రత్నాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 210, 217, 218లో 304 మంది రైతులు తాత తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూములు, దొరవారి పేర్ల మీద వస్తున్నాయని ఆ భూములు తమ పేర్ల మీద పట్టాలు ఇప్పించాలని సంబంధిత రైతులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
దుబ్బాక రెవెన్యూ డివిజన్ కోసం ఎంపీ వినతి
దుబ్బాక: దుబ్బాక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ రఘునందన్‌రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దుబ్బాక, మిరుదొడ్డి, అక్భర్పేట, భూంపల్లి, తొగుట, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దుబ్బాకలో ఇప్పటికే ఫారెస్ట్, ఐసీడీఎస్, వ్యవసాయ, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్డివిజన్ ఆఫీసులతో పాటు జూనియర్ సివిల్‌కోర్టు ఉందని తెలిపారు.
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఎంపీ మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రిని, ఎంపీ రఘునందన్‌రావు శాలువాతో సన్మానించారు.