ఏం వెలగబెట్టారని కాళేశ్వరానికి వెళ్తారు?: పొంగులేటి

ఏం వెలగబెట్టారని కాళేశ్వరానికి వెళ్తారు?:  పొంగులేటి
  •     బీఆర్ఎస్​ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఫైర్​
  •     కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ను జనం అసహ్యించుకుంటున్నరు
  •     పదేండ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత బీఆర్​ఎస్​ది
  •     6 గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నట్టు వెల్లడి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఏం వెలగబెట్టారని కాళేశ్వరానికి వెళ్తున్నారంటూ బీఆర్​ఎస్​ నేతలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఫైరయ్యారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని తన క్యాంప్​ ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థం, ధన లాభం కోసమే బీఆర్​ఎస్​సర్కారు  కాళేశ్వరం ప్రాజెక్టును ఇష్టారాజ్యంగా కట్టిందన్నారు. పదేండ్లలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత బీఆర్​ఎస్ కే దక్కిందని, ప్రజల సొమ్మును కొల్లగొట్టి దాచుకున్నారని ఆరోపించారు. 

అధికారం పోయాక వాళ్ల అవినీతి మొత్తం బయటకు వస్తున్నదని, ఇప్పుడు కేసీఆర్​తోపాటు కేటీఆర్, హరీశ్​రావును జనం అసహ్యించుకుంటున్నారన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో బీఆర్​ఎస్​నేతలు మెంటల్​ఎక్కి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ వేశామని, మార్చి 2న మరో 6,200 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన 70 రోజుల్లోనే దాదాపు 18,500 జాబ్స్​ ఇచ్చామన్నారు.  ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు  సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు. 

రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను త్వరలోనే ఇస్తామన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్​ సిలిండర్  స్కీమ్​లు ఎవరికైనా రాకపోతే మున్సిపాలిటీ, ఎంపీడీఓ ఆఫీస్​లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామన్నారు.