
కూసుమంచి, వెలుగు : పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, 18 నెలల్లోనే ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్లు మంజూరయ్యయాని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరాలకు దీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. గురువారం కూసుమంచి మండలంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోక్యా తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణంలో లోపాలు, ఇసక సరఫరాలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని లబ్ధిదారులను ఆరా తీశారు. ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన వాటికి దశల వారీగా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు తెలిపారు.
కూసుమంచి, నేలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్లలో రూ.6.50 కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, జంక్షన్ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. గత పాలకులు చేసిన అప్పులతో ఇబ్బందులు అవుతున్నా ప్రజల దీవెనలతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా మరిన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత స్పీడప్ చేయాలని సూచించారు.
పనులు నాణ్యతతో పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఈఈ మిషన్ భగీరథ వాణిశ్రీ, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, విద్యుత్ శాఖ ఏడీఈ లోక్యా నాయక్, కూసుమంచి తహసీల్దార్ ఉన్నారు.