ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : మంత్రి పొంగులేటి

 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : మంత్రి పొంగులేటి
  • ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే
  • వైరా నియోజకవర్గానికి అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం.. 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వైరా, వెలుగు: ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా నియోజకవర్గంలో మంగళవారం ఆయన పర్యటించారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. పుణ్యపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైరా నియోజకవర్గానికి  అత్యధిక ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని తెలిపారు. 

గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రతినెలా రూ.6,500కోట్లు చొప్పున చెల్లిస్తూనే రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఒకే ఏడాదిలో 56వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. నాలుగేండ్లలో అర్హులందరికీ ఇందరిమ్మ ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య,శీలం వెంకట నర్సిరెడ్డి, మచ్చా వెంకటేశ్వరరావు, దాసరి దానియేలు,  ఏదునూరి  ఉన్నారు. 

అప్పుల వల్లే పథకాలు ఆలస్యం.. 

నేలకొండపల్లి/కూసుమంచి : గత ప్రభుత్వం పదేండ్లు చేసిన అప్పుల వల్లే సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యమవుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. చెరువు మాదారం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోలు బంకు నిర్వహించడం మంచి ఆలోచన అన్నారు. చెన్నారం, సుర్దేపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో పర్యటించారు. కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల కాగా, నూతన వధూవరులను వారి ఇంటి వద్దకు వెళ్లి మంత్రి ఆశీర్వదించారు. 

రిటైనింగ్ వాల్ పనులపై సమీక్ష

ఖమ్మం, వెలుగు : మున్నేరు రిటైనింగ్ వాల్ పనులపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. మంగళవారం తన నివాసంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. భూసేకరణ సమస్యలపై ఆఫీసర్లతో చర్చించారు. 234.20 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుండగా, నగర పరిధిలో 114.11 ఎకరాలు, రూరల్​ మండల పరిధిలో 120.09 ఎకరాలు సేకరించాలి.

 ప్రభుత్వ భూమి 60.31 ఎకరాలు పోను, ప్రైవేట్ వ్యక్తుల నుంచి 173.29 ఎకరాలు సేకరించాలి. భూ నిర్వాసితులకు రూరల్ మండల పరిధిలో ఎన్ఎస్పీ మిగులు భూమి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బఫర్​జోన్​లో నిర్మించిన 28 ఇండ్లను తొలగించిన వారికి ప్రభుత్వ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.