అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కూసుమంచి, వెలుగు : పేదల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన పర్యటించారు. పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు.  పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఉన్న బీటీ రోడ్డు గత సంవత్సరం వచ్చిన వరదలో కొట్టుకొని పోయిందని, రూ.1.22కోట్లతో పాలేరు పీడబ్ల్యూడీ రోడ్డు హత్యతండా వరకు బీటీ రోడ్డు రిపేర్​ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. హత్యతండా గ్రామానికి లింక్ కెనాల్ తో కలుపుకొని సుమారు రూ.249 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

 గతంలో వరదలకు దెబ్బతిన్న కాలువలు, రోడ్ల రిపేర్​ పనులు, అంతర్గత సీసీ రోడ్డు, పశు వైద్యశాల, తాగునీటి సరఫరా పనులు, లింక్ కెనాల్ నిర్మాణం లాటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు, ఇతర అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రూ.20లక్షలతో నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించుకున్న లింగారంతండా గ్రామస్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం కూసుమంచి మండలం జీళ్లచెరువు ఎంపీపీఎస్​లో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పీఎస్​ఆర్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో షూస్, రెండు జతల సాక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబ్, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. 

మినీ  హైడల్ ప్రాజెక్టు ఆఫీసర్లపై ఆగ్రహం

మంత్రి పొంగులేటి శుక్రవారం పాలేరు మినీ హైడల్ విద్యుత్ ప్రాజెక్టును సందర్శించారు. పది రోజులు గా ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో మినీ హైడల్  ప్రాజెక్టు అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దెబ్బతినడంతో ప్రభుత్వం రెండున్నర కోట్లతో రిపేర్లు చేయించినా విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోవడం ఏంటని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

ప్యాక్స్ కేంద్రాల ద్వారా యూరియా సరఫరా

పాలేరు నియోజకవర్గం పరిధిలో ఇక నుంచి ప్యాక్స్ కేంద్రాల ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి యూరియా సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన స్థాయిలో యూరియా సరఫరా చేయని కారణంగా కొంత  కొరత ఉందని ఆయన తెలిపారు. రామగుండం ఆర్​ఎఫ్​సీఎల్​ ఉత్పత్తి సాంకేతిక సమస్యల వల్ల నిలిచి పోయిందన్నారు. జిల్లాకు రాబోయే 7 రోజులలో 1600 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ వస్తుందని చెప్పారు.

 యూరియా పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. యూరియా పంపిణీ పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్ అధికారిని నియమించాలన్నారు. కలెక్టర్ అనుదీప్​ మాట్లాడుతూ జిల్లాకు వచ్చే యూరియా స్టాక్ ఇప్పటి వరకు 60 శాతం మార్కెట్ ద్వారా వ్యవసాయ సహకార సొసైటీలకు, 40 శాతం ప్రైవేటు డీలర్లకు కేటాయించి రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇక నుంచి మంత్రి ఆదేశాలు మేరకు పాలేరు నియోజకవర్గం పరిధిలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్యాక్స్ కేంద్రాల ద్వారా మాత్రమే యూరియా పంపిణీకి చేస్తామన్నారు.