ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి పై అధికారులతో సమీక్షించారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 875 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 475 ఇండ్లు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. 420 కి పైగా ఇండ్లు బేస్​మెంట్​ లెవల్ పూర్తి చేయగా, మొదటి విడత రూ.లక్ష మంజూరు చేశామన్నారు. డ్వాక్రా ద్వారా రుణాలు అందించాలని సూచించారు. రెండో విడతలో జిల్లాకు 17,983 ఇండ్ల మంజూరు చేయనున్నామన్నారు.

  12,276 ఇండ్లకు ఆయా నియోజకవర్గాల నుంచి  ప్రతిపాదనలు రాగా, ఇప్పటివరకు 7,212 ఇండ్లు ఇన్​చార్జి మంత్రి  ఆమోదం లభించిందని చెప్పారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్​వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని మొదటి విడతగా నేలకొండపల్లి, రెండో విడతగా బోనకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో భూ భారతి-పై రెవెన్యూ సదస్సులు నిర్వహించామని చెప్పారు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో సర్వే చేసేందుకు మండలానికి రెండు టీమ్​ల చొప్పున సిద్ధం చేయాలన్నారు. 

జిల్లాలో 465 మంది లైసెన్స్ సర్వేయర్లకు దరఖాస్తు చేశారని, రిటైర్, ప్రస్తుత సర్వేయర్లతో వీరందరికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. తీగల వంతెన నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన 28 మందికి ప్రత్యామ్నాయ స్థలం చూపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల వేగవంతానికి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు.  

భూ భారతి కింద పైలెట్ మండలాల భూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేశామని చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీ లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ సమీక్షలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

టీజేఎఫ్​ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరణ 

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) యూనియన్​ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్నందున ఈనెల 31న హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్న రజతోత్సవాన్ని జయప్రదం చేయాలని  టీజేఎఫ్​ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపునిచ్చారు.  ఈ మేరకు గురువారం వేడుకల వాల్ పోస్టర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో  ఆవిష్కరించారు. 

 రైతు భరోసా పూర్తిగా ఇస్తాం 

కారేపల్లి :  ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మండలంలోని చిమ్నా తండాలో రైతు బంధు మండల మాజీ కన్వీనర్ గగులోత్ శ్రీను కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ధరణితో ఇబ్బంది పడ్డ రైతులందరికీ భూభారతితో భూములకు భద్రత కల్పిస్తూ చట్టం రూపొందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో అర్హులందరికీ ఇండ్లు  ఇవ్వలన్నదే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యమన్నారు.