ఖమ్మం రూరల్, వెలుగు : ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, నష్టపోయిన ప్రతి ఇంటికీ సహాయం అందిస్తామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, జలగం నగర్, పెద్దతండా వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. పారిశుధ్య చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇండ్లలోని బురద శుభ్రం చేయాలన్నారు.
తక్షణ సహాయం, బాధితుల వివరాల సేకరణపై పలు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానంతో సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. బైక్‌పై మంత్రి కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. ముంపు బాధితులకు శుక్రవారం సాయంత్రం లోగా రూ.10వేలు వారి అకౌంట్లలో జమ అవుతాయన్నారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
గండ్లు త్వరగా పూర్తి చేయండి
కూసుమంచి : పాలేరు రెండో జోన్ఎడమ కాలువ, మినీ హైడల్ విద్యుత్ కేంద్రం కాల్వకు పడ్డ గండ్లను త్వరగా పూర్తి చేయాలని ఐబీ ఈఈ వెంకటేశ్వర్లును మంత్రి పొంగులేటి ఆదేశించారు. గురువారం ఖమ్మం ఎంపీ రఘరాంరెడ్డితో కలిసి మంత్రి పాలేరులోని మినీ హైడల్ విద్యుత్ కేంద్రం, మత్స్యపరిశోధన కేంద్రాల్లో వరద తీవ్రతను పరిశీలించారు. అనంతరం 365 బీబీ హైవే లో పాలేరు అలుగు పారిన ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి త్వరగా పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట నాయకులు సూర్యానారాయణరెడ్డి, రమేశ్‌రెడ్డి, గోపాల్‌రావు, బజ్జూరి వెంకటరెడ్డి, పిడమర్తి రవి, ఏడీఏ సరిత, ఏవో వాణి పాల్గొన్నారు.