అద్దె బస్సుల అసోసియేషన్​కు మంత్రి పొన్నం హామీ

అద్దె బస్సుల అసోసియేషన్​కు మంత్రి పొన్నం హామీ

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నదని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అద్దె బస్సుల ఓనర్లు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అద్దె బస్సుల ఓనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో అద్దె బస్సుల అసోసియేషన్ నేతలతో మంత్రి పొన్నం సమావేశమయ్యారు. స్కీమ్ స్టార్ట్ అయ్యాక ప్యాసింజర్ల రద్దీ పెరగటంతో అద్దె బస్సుల మీద భారం పెరిగి, మైలేజ్ తగ్గుతున్నదని, కిలోమీటర్ కు ఇస్తున్న రెంట్ రూ.2 పెంచాలని మంత్రిని అసోసియేషన్ నేతలు కోరారు. కిలోమీటర్ కు ఇస్తున్న రెంట్, ఇన్సూరెన్స్ పై  ఆర్టీసీ అధికారులతో చర్చిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి త్వరలో మరోసారి మీటింగ్ కు పిలుస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో అద్దె బస్సుల అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి, జీఎస్ మహిపాల్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.   

స్కీమ్ పై మంత్రి రివ్యూ

సెక్రటేరియెట్ లో మహాలక్ష్మి స్కీమ్ పై రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలతో మంత్రి సమావేశమయ్యారు. సంక్రాంతి టైమ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కీమ్ ను సక్సెస్ చేశామని మంత్రికి అధికారులు వివరించారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహాకారాలు ఉంటాయని అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల  సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి అధికారులకు తెలిపారు. జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థికి బంగారు పతకం రావడం పట్ల మంత్రి పొన్నం హర్షం వ్యక్తం చేశారు.  నల్గొండ జిల్లా తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన జి. భవజ్ఞ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది.