
మాసబ్ ట్యాంక్ పరిధిలోని చింతల్ బస్తిలో మార్చి 3వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, స్థానిక శాసన సభ సభ్యులు హుసేన్, ఏరియా కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వం 27వ సారి పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల సహకారం లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఈరోజు పోలియో రహిత దేశంగా మారిందంటే నిరంతర కార్యక్రమం వల్లే అన్నారు.
హైదరాబాద్ లో 2007, దేశంలో 2011 తరువాత ఒక పోలియో కేసు కూడా రాలేదన్నారు. తరువాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. 2012లో భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 2800 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బస్ స్టాప్ లలో, హాస్పిటల్ లు, 85 ట్రాన్సిట్ పాయింట్స్,123 మొబైల్ బృందాల ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోలియో చుక్కలు వేపించలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 4, 5, 6 తేదీల్లో 11వేల మంది సిబ్బంది హైదరాబాద్ లో ఇంటింటికీ తిరుగుతున్నారని తెలిపారు.
సరోజినీ, నిలోఫర్,ఎంఎన్ జి హాస్పిటల్ లు డెవలప్ చేయాలని ఎమ్మెల్యే కోరారన్నారు. త్వరలోనే ఆ హాస్పిటల్ లని సందర్శిస్తా.. సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నిటి కంటే మహా భాగ్యం.. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం కోరారు.