హుస్నాబాద్​లో వేంకటేశ్వర ఆలయాన్ని కడుతాం : మంత్రి పొన్నం​

హుస్నాబాద్​లో వేంకటేశ్వర ఆలయాన్ని కడుతాం : మంత్రి పొన్నం​
  •     నిధులు ఇవ్వాలని టీటీడీ చైర్మన్​ను కోరిన మంత్రి పొన్నం​

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని, ఇందు కోసం నిధులు మంజూరుచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ టీటీడీ చైర్మన్​ భూమన కరుణాకర్​రెడ్డిని కోరారు. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థాన చైర్మన్​ కరుణాకర్​రెడ్డిని కలిసి హుస్నాబాద్​లో వేంకటేశ్వర ఆలయ నిర్మాణం గురించి వివరించారు.

ఎన్నో ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలు హుస్నాబాద్​లో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని కోరుతున్నారన్నారు. ఆలయానికి సరిపడా స్థలాన్ని సేకరించి ఇస్తామన్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరుచేయాలని వినతిపత్రాన్ని ఇచ్చారు.  వేంకటేశ్వరస్వామి కృపా, కటాక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం

ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. సోమవారం ఆయన హుస్నాబాద్​లో మార్నింగ్​వాక్​ చేస్తూ ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ యోగక్షేమాలు అడిగారు. కొందరు తమకు ఇండ్లు కావాలని మంత్రిని అడగగా ఇండ్లు లేనివారందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు.

త్వరలోనే ఆరు గ్యారంటీలను అమలుచేస్తూ కాంగ్రెస్​మార్క్​ ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సింగిల్​ విండో చైర్మన్​ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ చిత్తారి పద్మ, నాయకులు హసన్​, అక్కు శ్రీనివాస్​, చిత్తారి రవీందర్​ ఉన్నారు.