
- 8 లైన్లుగా చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి పొన్నం
సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్ ను ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలతో కలిపే రాజీవ్ రహదారిని 8 లైన్లకు విస్తరించాలనే డిమాండ్ పెరుగుతోంది. మూడు దశాబ్దాల కింద శామీర్ పేట నుంచి మంచిర్యాల వరకు 205 కిలో మీటర్ల మేర నిర్మించిన రాజీవ్ రహదారిని దశాబ్దంన్నర కింద 4 లైన్ల స్టేట్ హైవేగా మార్చారు. ఈ రోడ్డు సిద్దిపేట జిల్లాలో 90 కిలో మీటర్ల మేర కొనసాగుతుండగా ప్రతి రోజు 60 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ బాగా పెరిగింది. మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాహనాలను రాజీవ్ రహదారి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తుంది. ఇటీవల ఈ రహదారిని 8 లైన్ల రోడ్డుగా విస్తరించాలని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేయడంతో దీనిపై చర్చ ప్రారంభమైంది.
భారీగా వాహనాల రాకపోకలు
మేడ్చల్ జిల్లా శామీర్ పేట నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, శనిగరం, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, గోదావరిఖని మీదుగా మంచిర్యాల సమీపంలోని జైపూర్ క్రాస్ వరకు 205 కిలోమీటర్ల మేర సాగే రాజీవ్ రహదారిపై భారీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు, గోదావరిఖని నుంచి ఇసుక, కరీంగనర్ జిల్లా నుంచి గ్రానైట్ ను రవాణా చేసే భారీ వాహనాలతో పాటు రామగుండం పవర్ ప్లాంట్, రామగుండం ఫర్టిలైజర్స్, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి.
దీంతో పాటు సిద్దిపేట జిల్లాలోని 3 రిజర్వాయర్లైన కొండ పోచమ్మ, రంగనాయక, మల్లన్నసాగర్ తో పాటు కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ రాజీవ్ రహదారికి సమీపంలోనే ఉండడంతో టూరిస్టుల తాకిడి బాగా పెరిగింది. ఇదే సమయంలో సిద్దిపేట వరకు రైల్వే లైన్ పనులు పూర్తి కావడంతో సరుకు రవాణా పెరిగే అవకాశం ఉండడంతో రాజీవ్ రహదారిని 8 లైన్లుగా విస్తరించాలనే అంశం తెరపైకి వచ్చింది.
ఆందోళన కలిగిస్తున్న మలుపులు
రాజీవ్ రహదారిపై కొన్ని చోట్ల మలుపులు ఆందోళన కలిగిస్తున్నాయి. సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మలుపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజీవ్ రహదారిని 4 లైన్లకు విస్తరించేటప్పుడు మలుపులు తొలగించాలనే విషయంపై ఆందోళనలు జరిగాయి. వీటిని సవరించడం కోసం అప్పుడు అసెంబ్లీ హౌజ్ కమిటీని వేసినా యధావిధిగానే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ రహదారిని 8 లైన్లకు విస్తరిస్తే మలుపులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. పలుచోట్ల కొత్తగా బైపాస్ రోడ్లు కూడా
వస్తాయి.
విస్తరణకు ప్రధాన కారణాలు
4 లైన్ల రాజీవ్ రహదారి ప్రస్తుత వాహన రాకపోకలకు సరిపోక తరచూ ట్రాఫిక్జామ్లతో పాటు ప్రమాదాలకు కారణమవుతోంది. రామగుండంతో పాటు ఉమ్మడి కరీంనగర్‌లో అనేక పరిశ్రమలు, కీలక పారిశ్రామిక కేంద్రాలకు హైదరాబాద్ తో కనెక్టివిటీని మెరుగుపరచడానికి 8 లైన్ల రహదారి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదల, పారిశ్రామిక విస్తరణ, సరుకు రవాణాకు అనుకూలంగా ఉండేందుకు రాజీవ్ రహదారిని 8 లైన్లకు విస్తరించాలని వ్యాపారవేత్తలు, వాహనదారులు కోరుతున్నారు.