ఏమన్నావో నీకు నువ్వే గుర్తు తెచ్చుకో పవన్ కల్యాణ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

ఏమన్నావో  నీకు నువ్వే గుర్తు తెచ్చుకో పవన్ కల్యాణ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఏపీ డీప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ అన్న మాటలను ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటు అయినప్పటినుంచి పవన్ కల్యాణ్ ది ఇదే తీరు అన్నారు. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలంగాణ సమాజానికి  పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్..
  
భారత  రాజ్యాంగం  కల్పించిన  సౌకర్యాన్నిబట్టి  ఎవరైనా,  ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.  హైదరాబాద్‌‌లో  ఎవరో సభ పెడితే  మాకేమీ  అభ్యంతరం లేదు.  కానీ,  తెలంగాణ  విషయంలో, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఎలా వ్యవహరించాడో,  ఏమి  మాటలన్నాడో  పవన్ కల్యాణ్  ఒకమారు గుర్తు తెచ్చుకోవాలి. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు’ అని ఆయనే స్వయంగా వెల్లడించారు.   తెలంగాణ  ప్రాంత  ప్రయోజనాలను పణంగా పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్య వర్గాలు దశాబ్దాలు దోపిడీ పర్వం సాగించి,  అది  ఆగిపోవద్దనే  కుయుక్తితోనే  సమైక్య నినాదం వినిపించారు.  తెలంగాణ ఏర్పాటును మొదట్నుంచీ అడ్డుకుంటూ వచ్చారు. 

‘తమరిదీ అదే భావనా?  అందుకే  తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేకపోయారా?  తెలంగాణ సకల జనుల ప్రత్యేక రాష్ట్ర కాంక్షను, ఆవశ్యకతను, దాదాపు అన్ని రాజకీయ  పార్టీలు  అంగీకరించి, ఆమోదించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తమరు మాత్రం గుర్తించలేదని, అంగీకరించలేదనే కదా  దీని అర్థం!   రాష్ట్రం ఏర్పడి,  ఎవరి పాలన వారు సాగిస్తూ తమదైన రీతిలో ప్రగతి సాధిస్తున్న క్రమంలో... ఉన్నట్టుండి ‘తెలంగాణ వారి దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి’ అనడం అంటే, అదెంత తీవ్రమైన వ్యాఖ్య?! ఎవరో  రచయిత స్క్రిప్టు రాసిస్తే,  దర్శకుడు దిశా నిర్దేశం చేస్తే డైలాగులు  వల్లెవేయడం  కాదు కదా  ప్రజాజీవితమంటే!   ఏదో దారిన పోయే  సామాన్యమైన వ్యక్తిగా కాకుండా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడిన విషయం మరిచిపోయారా?  ఇటువంటి మీ వైఖరిని, మీ వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం ఎలా స్వీకరిస్తుందని భావిస్తున్నారు?’   సినీ హీరోగా  కళా నైపుణ్యాన్ని  బట్టి  ఆదరిస్తారు,  నాయకుడిగా విధానాలను బట్టి  స్పందిస్తారు.  ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణ  సమాజానికి  క్షమాపణలు తెలిపి హైదరాబాద్‌‌కు రావాలని నేను సూచించాను అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.