మల్లన్నసాగర్‌కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్లే : హరీశ్​రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్​ ఫైర్

మల్లన్నసాగర్‌కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్లే : హరీశ్​రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్​ ఫైర్

హైదరాబాద్, వెలుగు: మల్లన్నసాగర్ కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్లో,  కాళేశ్వరం నీళ్లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ డిమాండ్​చేశారు. ‘‘ఇన్నేండ్లు రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు కనబడ్డా అవన్నీ కాళేశ్వరం నీళ్లే అని అబద్ధాలు చెప్తూ బతికిన్రు. కానీ, కాళేశ్వరం కుంగిపోయి చుక్క నీరు కూడా వాడలేని పరిస్థితి వచ్చింది. దీంతో గతంలో మా కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి మా ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోసి మిడ్​మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్​లాంటి ప్రాజెక్టులను నింపింది. 

ఇదంతా కండ్ల ముందు కనిపిస్తున్నా హరీశ్​రావు ఇంకా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నడు” అని ఆయన మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడారు. 2009 , 2014 మధ్య తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, దానిని ప్రారంభించేందుకు ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వస్తానంటే.. తెలంగాణ వ్యతిరేకి అయిన ఆయనతో ప్రారంభించడం ఇష్టంలేక తానే అడ్డుకున్నానని తెలిపారు. ఒకవేళ వస్తే హెలికాప్టర్ ను పేల్చివేస్తానని హెచ్చరించానని పొన్నం గుర్తుచేశారు. ‘‘ఇంజనీర్ కాని ఇంజనీర్ కేసీఆర్ చేసిన నిర్వాకం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాకుండా కుంగిపోయింది. 

ఆ ప్రాజెక్టు నుంచి ఒక చుక్క నీరు కూడా ఎల్లంపల్లికి ఎత్తిపోసే పరిస్థితి లేదు. దీంతో ఎల్లంపల్లి నుంచే ఎల్ఎండీ, మిడ్​మానేరు, రంగనాయకసాగర్​, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​కు ఎత్తిపోసినం. మరి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఎట్లయితయో ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీశ్​ రావు సమాధానం చెప్పాలి” అని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్​లోనని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందే కుంగిపోయిందని ఆయన తెలిపారు.  ​