
- ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది: మంత్రి పొన్నం
- అగ్రికల్చర్ వర్సిటీలో బీసీ సెల్ ప్రారంభోత్సవానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, ఈ ప్రక్రియకు అందరి మద్దతు అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సెల్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, శాఖల్లో ఇలాంటి సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు కొత్త సాంకేతికత, వంగడాలను అందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీసీ సెల్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అకడమిక్ బ్లాక్‌లోని సెమినార్ హాల్‌ను ప్రారంభించి మాట్లాడారు.
వ్యవసాయం.. ప్రభుత్వ ప్రాధాన్యత. రైతు భరోసా నిధుల విడుదలకు యూనివర్సిటీ వేదికగా నిలిచింది. స్టూడెంట్ల స్కాలర్‌షిప్ పెండింగ్ అంశాలను సమీక్షిస్తాం. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో డ్యుయల్ డిగ్రీ ఒప్పందం అభినందనీయం. దానికి ఆర్థిక సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తాం’’అని పొన్నం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలతో పాలన సాగిస్తున్నదని వీసీ అల్దాస్ జానయ్య అన్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఆర్థిక సహాయం అందించాలని మంత్రికి స్టూడెంట్లు వినతిపత్రం అందజేశారు. బీసీ సెల్ ఇన్‌చార్జ్ ఆఫీసర్‌గా నియమితులైన డాక్టర్ సీహెచ్ దామోదర రాజును మంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్, అసోసియేటెడ్ డీన్ గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.