సీఎం ప్రత్యేక నిధి నుంచి.. పాములపర్తికి రూ.35 లక్షలు: పొన్నం

సీఎం ప్రత్యేక నిధి నుంచి.. పాములపర్తికి రూ.35 లక్షలు: పొన్నం

గత ఐదేళ్లలో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకున్నా గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్ లు శక్తికి మించి కృషి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే  తూముకుంట నర్సారెడ్డి,పాములపర్తి గ్రామ సర్పంచ్  తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి పాములపర్తి గ్రామాభివృద్ధికి రూ. 35 లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 

గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు పొన్నం. కాంగ్రెస్ హయాంలో జవహర్ యోజన పథకం ద్వారా ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేలా పాలన సాగిందన్నారు.  రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని విమర్శించారు.  మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నందున..మరిన్ని కొత్త బస్సులతో సౌకర్యాన్ని మెరుగు పరిచేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 420 గ్రామాలలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకున్నందుకు అభినందించారు  పొన్నం .