రవాణారంగంలో సాంకేతిక విప్లవాన్ని తెస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణారంగంలో సాంకేతిక విప్లవాన్ని తెస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

నల్గొండ, వెలుగు: రవాణారంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, రూ.8 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 17 ఆటోమేటెడ్  టెస్టింగ్  స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ సమీపంలోని దండంపల్లి వద్ద ఆటోమేటెడ్  టెస్టింగ్  స్టేషన్  బిల్డింగ్​కు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనం ఫిట్​నెస్  లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్  టెస్టింగ్  స్టేషన్  ఉపయోగపడుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాకు 77 ఈవీ బస్సులు మంజూరు చేయగా, శనివారం 40 బస్సులను ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలకు స్థలాన్ని సేకరిస్తే, బిల్డింగ్​ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను అందజేయాలని సూచించారు.

పొన్నం కృషితోనే 42 శాతం రిజర్వేషన్లు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్​ కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నార్కట్ పల్లి బస్​ డిపోకు పూర్వ వైభవం తేవాలని కోరారు. శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి మాట్లాడుతూ డ్రైవింగ్  లైసెన్స్​ కోసం ఆఫీసుకు వెళ్లకుండానే, ఆర్టీఏ అధికారులు  లైసెన్స్ జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి టెస్టులు చేయకుండా లైసెన్సులు ఇస్తున్నారని పేర్కొన్నారు. నల్గొండ ఎంపీ కె రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీఎల్ఆర్, కేజై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, ఎస్పీ శరత్ చంద్ర పవార్  పాల్గొన్నారు.