హుస్నాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బంగారం (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆకుల వెంకట్, పద్మ, రవి, సది, రమణ, వీరన్న, రజిత, శ్రీధర్ పాల్గొన్నారు.
మార్కెట్ యార్డుకు నిధులు మంజూరు
హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామ శివారులోని పవనసుత పారా బయిల్డ్ మిల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో మార్కెట్ యార్డు అభివృద్ధి పనుల కోసం రూ.8.05 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ చందు, డైరెక్టర్లు శ్రీనివాస్, మారుతి, త్రిమూర్తి, యాదవరెడ్డి, బాలయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.
