కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన.. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన.. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఐదు నెలల శరత్ అనే బాబు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. 

షేక్ పేటలోని వినోబానగర్ లో కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి తల్లిదండ్రులు అంజి, అనుష దంపతులు.. రోజు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. డిసెంబర్ 8న గుడిసెలో నిద్రిస్తున్న ఐదు  నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం (డిసెంబర్ 24న) మృతి చెందాడు.

గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. నడుచుకుంటూ వెళ్లే వాళ్లను, బైకులపై వెళ్లను వెంటాడుతున్నాయి. ఇక చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు దాడులకు తెగబడిపోతున్నాయి. రాత్రి వేళ్లల్లోనైతే పట్టాపగ్గాలే ఉండవు.  

కుక్కల భయంతో ఇంట్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చాలు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే శునకాల దాడిలో పలు చోట్ల చాలామంది మృత్యువాత పడ్డారు. ఎందరో పిల్లలు గాయాలపాలయ్యారు.