ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై దృష్టి పెట్టాలి : మంత్రి పొన్నం

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై దృష్టి పెట్టాలి : మంత్రి పొన్నం
  • ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి మరో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రాబోతుండటంతో ఆ బస్సుల ఆపరేషన్, అందులో ఎదురయ్యే సమస్యలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సెక్రటేరియెట్​లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ప్రతినిధులతో పాటు రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 775 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో మరో 2 వేల బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 

ఈ బస్సులను నడపడంలో డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా వారికి తగిన శిక్షణ ఇవ్వడం, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న బస్సుల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై ఇందులో చర్చించారు. డీజిల్ బస్సులతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రమాద రేటు ఎక్కువగా నమోదు అవుతుందని, అందుకే వీటి ఆపరేషన్ సజావుగా జరిగేలా తగిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ బస్సులను రాష్ట్రానికి డెలివరీ చేయడంలో ఆయా కంపెనీలు కచ్చితంగా సమయపాలన పాటించాలని సమావేశంలో కంపెనీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ  ప్రతినిధులు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్​ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.