కోహెడ, వెలుగు: రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరికీ సర్కారు సారె ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో కలెక్టర్ హైమావతితో కలిసి మహిళలకు చీరలను, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు ఇచ్చామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసే ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, డీఆర్డీవో జయదేవ్, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎంసీ చైర్ పర్సన్ నిర్మల, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు సుధాకర్, జయరాజు, రవి, జగన్ రెడ్డి, శ్రీధర్ ఉన్నారు.
హుస్నాబాద్‌లో 'మహిళా శక్తి బజార్' ఏర్పాటు
హుస్నాబాద్/అక్కన్నపేట:హైదరాబాద్ శిల్పారామం తరహాలో హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని అమరుల స్థూపం సమీపంలో 10 ఎకరాల్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్, అక్కన్నపేట రైతు వేదికల్లో మంత్రి మహిళలకు బొట్టు పెట్టి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ..మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే ఉత్పత్తులు, వస్తువుల విక్రయాలకు ఈ బజార్ శాశ్వత వేదికగా నిలుస్తుందన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని వెల్లడించారు. హుస్నాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో మహిళలకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చీరల పంపిణీ ఏడు మండలాల్లో పండగ వాతావరణంలో జరుగుతోందన్నారు. 18 ఏళ్ల పైబడిన ప్రతీ మహిళకు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి చీరలు అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, ఆర్డీవో రామ్మూర్తి, లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: మంత్రి దామోదర
సంగారెడ్డి టౌన్: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు.
ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి కార్యకలాపాల్లో మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అడిషనల్ కలెక్టర్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ద్వారా అమలైన వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో సూర్యారావు, జిల్లా మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు..
జోగిపేట : మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోల్ మండలంలోని సంగుపేట గ్రామ శివారులోని లక్ష్మీదేవి గార్డెన్‌లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 18 ఏండ్లు ఉండి తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతీ మహిళకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 16,164 స్వయం సహాయక సంఘాలు, లక్షా 65 వేల 467 మంది సభ్యులు ఉన్నారన్నారు. వారందరికీ చీరలు అందిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్ : నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని మహిళలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి చీరలు పంపిణీ చేశారు. మహిళలకు క్వాలిటీ చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో కొంత మేర ఆలస్యమైందన్నారు. దసరాకు పంపిణీ చేయాల్సిన చీరలను క్వాలిటీతో ఇప్పుడు పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు అనేక పథకాలను ప్రవేశపెట్టిన విజయవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా గ్రూప్ లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం నాగలగిద్ద మండలంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వడమే కాకుండా అవసరమైన ఇసుకను పంపిణీ చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
