సీఎం హోదాలో ఫస్ట్ టైం రేపు(సెప్టెంబర్ 30) కరీంనగర్ కు రేవంత్ రెడ్డి

 సీఎం హోదాలో ఫస్ట్ టైం రేపు(సెప్టెంబర్ 30) కరీంనగర్ కు రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి  రేపు(సెప్టెంబర్ 30) కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న ఆయన.. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లనున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తు ఏర్పాట్లపై కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సమావేశం నిర్వహించారు.సీఎం పర్యటన సందర్భంగా మొత్తం 1600 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యలను 12 సెక్టార్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.

వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ తదితర అంశాలపై పోలీస్ సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ALSO READ : మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ రాజీనామా చేయాలి

భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. సీఎం పర్యటన సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.