సంరక్షణ లేని పిల్లలకు రక్షణగా శిశు విహార్ : పొన్నం ప్రభాకర్

సంరక్షణ లేని పిల్లలకు రక్షణగా శిశు విహార్ : పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్
  •     అనాథ పిల్లలకు సర్టిఫికెట్ల పంపిణీ 

ముషీరాబాద్, వెలుగు : తల్లిదండ్రులు పిల్లల పోషణ నుంచి తప్పించుకునేందుకు నిర్లక్ష్యంగా వదిలివెళ్లడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సంరక్షణ లేని పిల్లలకు ప్రభుత్వం తరఫున శిశు విహార్ రక్షణగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అనాథ పిల్లలకు బర్త్, క్యాస్ట్, ఆధార్, సదరం సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శైలజ హాజరై

2,766 మంది పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఎవరు కూడా అనాథలుగా రోడ్డు మీద ఉండకుండా సంస్థ మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఎవరైనా ఎక్కడైనా అనాథలుగా ఉంటే ఉంటే వారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైల్డ్ కేర్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు సర్టిఫికెట్లు అందజేస్తున్నామని చెప్పారు. బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో బల్దియా కీలకపాత్ర వహించిందని కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవి చారి, అధికారులు వెంకటాచారి, శైలజ, అంకేశ్వరరావు, శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 

నేడు బల్దియాపై  ఇన్​చార్జి మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి  పొన్నం ప్రభాకర్ బుధవారం బల్దియాపై రివ్యూ నిర్వహించనున్నారు. హెడ్డాఫీసులో నిర్వహించే సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రాస్ పాల్గొననున్నారు. సిటీ డెవలప్ మెంట్​పై మంత్రి తొలి సమావేశం నిర్వహిస్తున్నారు.  గ్రేటర్ డెవలప్​మెంట్ పనులపై చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో  జరిగిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటితో పాటు వచ్చే రోజుల్లో చేపట్టేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలు తదితర అన్ని అంశాలపై రివ్యూలో చర్చించే అవకాశం ఉంది.