కేటీఆర్​ మాటలు హాస్యాస్పదం : పొన్నం

కేటీఆర్​ మాటలు హాస్యాస్పదం : పొన్నం
  • మిగిలిన పిల్లర్లను కాపాడుకునేందుకే మేడిగడ్డ, అన్నారంలోని నీళ్లు కిందికి: పొన్నం
  •     ఈ విషయం కూడా కేటీఆర్​కు తెలియదా ?
  •     సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ

హనుమకొండ/హుస్నాబాద్​, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ విషయంలో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ విమర్శించారు.  గత వానకాలం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడటంతో మిగిలిన పిల్లర్లను కాపాడుకునేందుకు రిజర్వాయర్లలోని​ నీళ్లన్నీ కిందికి వదిలేశారని,  కానీ కేటీఆర్​ మాత్రం తామే కావాలని నీళ్లను కిందికి వదిలేసినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  

నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్ని నడిపిన కేటీఆర్.. నిన్ననే తెలంగాణ ప్రాజెక్టులను చూసినట్టు.. తెలంగాణ ప్రాజెక్టుల నీటి కెపాసిటీ, వాటర్ అవైలిబిలిటీ, స్టోరేజ్, వర్షపాతం ఇవ్వన్నీ తెలియనట్టు.. మొత్తం రైతాంగం అంతా ఆయనకు చెప్పుకుంటునట్టు  కరీంనగర్​లోని ఇరుకుళ్ల గ్రామానికి వచ్చి తమపై నిందలు మోపుతున్నాడని ఫైర్​ అయ్యారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌ ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌ ఆధునికీకరణ పనులకు శుక్రవారం పొన్నం శంకుస్థాపన చేశారు. మహా శివరాత్రి సందర్భంగా భీమదేవరపల్లి మండలం వంగరలోని కైలాస కల్యాణ క్షేత్రంలో పూజలు చేసిన అనంతరం మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 90 రోజులు మాత్రమే అయ్యిందని, ఈ కాలంలో ప్రాజెక్టును చెడగొట్టలేమని, కొత్తగా నిర్మించలేమని పేర్కొన్నారు. కానీ కేటీఆర్​ మాత్రం తామే ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  

‘మహాలక్ష్మి’ తో ఆర్టీసీకి ప్రతినెలా రూ.350 కోట్లు

 మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 350 కోట్లు అందుతున్నాయని పొన్నం ప్రభాకర్‌‌‌‌ తెలిపారు.  మహాలక్ష్మి స్కీంతో గతంలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు 100 శాతానికి చేరుకుందని తెలిపారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలకులు ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేస్తే తాము లాభాల బాట పట్టిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌ మేరకు కొత్త బస్సులు కొంటామని తెలిపారు. పదేండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న కార్మికుల పీఆర్సీ బకాయిల బాండ్స్‌‌‌‌ చెల్లింపు కోసం రూ.280 కోట్లు ఇచ్చామని, పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కోడ్‌‌‌‌ రాకముందే వాటిని కార్మికులకు అందజేస్తామన్నారు.