ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
  • మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామగ్రామాన కాంగ్రెస్​ జెండా ఎగురవేయాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, ఎల్కతుర్తిలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాల్లో డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. 'నా ఎన్నికల కంటే.. మీ ఎన్నికల కోసం ఎక్కువ కష్టపడతా'నని, అందుకు తగ్గట్టుగా మీరు కూడా కష్టపడాలని పార్టీ నేతలకు సూచించారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో 100 శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. 

గ్రూపులు పెడితే ఫిర్యాదు చేస్త..

నియోజకవర్గంలో కొందరు పొన్నం యువసేన పేరున గ్రూపులు పెడుతూ కార్యక్రమాలు చేస్తున్నారని, ఇకపై తన పేరు వాడి గ్రూపులు పెడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంత్రి పొన్నం అన్నారు. పార్టీలో యాత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ మాత్రమే ఉంటాయని, వ్యక్తుల పేరుతో గ్రూపులు వద్దని సూచించారు. ఇకపై తన పేరు వాడిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.‌ సమావేశంలో పీసీసీ పరిశీలకుడు మక్సూన్, పీసీసీ మెంబర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షుడు సుకినె సంతాజీ, నాయకులు తదితరులున్నారు.