పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బొట్టుపెట్టి పిలువాల్న? : మంత్రి పువ్వాడ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బొట్టుపెట్టి పిలువాల్న? : మంత్రి పువ్వాడ
  • పొంగులేటిపై మంత్రి పువ్వాడ కామెంట్స్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బొట్టుపెట్టి పిలువాల్న.. ఇంత పెద్ద మీటింగ్​కు ఎవరికీ ప్రత్యేక ఆహ్వానం ఉండదు’ అని మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌ అన్నారు. పార్టీలో వ్యక్తులకు ప్రాధాన్యం ఉండదని, కేసీఆరే సుప్రీం అని చెప్పారు. పొంగులేటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఉన్నారో, లేదో ఆయన్నే అడిగి తెలుసుకోవాలన్నారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకల్​గా పాదయాత్ర ఉండడం వల్లే కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సభకు హాజరుకాలేకపోయారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌‌‌‌ను ఓడించడానికి కేసీఆర్‌‌‌‌ ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణల్లో నిజంలేదని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని, ఆ పార్టీలోని వ్యక్తులే పార్టీని ఓడిస్తారన్నారు.

ఖమ్మం సభకు జనం రాలేదంటున్న బండి సంజయ్‌‌‌‌ కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్‌‌‌‌ ఉంటుందో లేదో తెలియాలంటే ఏదో ఒక మోటారులో వేలు పెడితే సరిపోతుందన్నారు. బండివన్నీ తొండి మాటలేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీల ఐక్యతకు ఖమ్మం సభ నాంది పలికిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డి అన్నారు. కరీంనగర్‌‌‌‌ సింహగర్జన సభ తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తినిస్తే.. ఖమ్మం సభ దేశంలో అభివృద్ధికి నాంది పలుకబోతున్నదన్నారు. మోడీ, షా దేశాన్ని ఇద్దరు గుజరాతీలకు అమ్మేస్తున్నారని, లక్షల కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. జిల్లాలో అడుగు పెట్టాలని చూసిన బీజేపీ.. ఖమ్మం సభను చూసి ఆలోచనలో పడిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 2024లో బీఆర్​ఎస్ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మంలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు.